
యాపిల్ వెండార్ల ప్లాంట్లలో పని చేసే చైనా టెకీలు స్వదేశాలకు వెళ్లిపోయినా భారత్‌లో ఐఫోన్ 17 ఫోన్ల ఉత్పత్తి ప్రణాళికలు యథాతథంగానే కొనసాగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా నుంచి, ఐఫోన్ల తయారీలో కీలకమైన యంత్రపరికరాల దిగుమతులు ఇటీవలి కాలంలో మెరుగుపడ్డట్లు వివరించాయి.
భారత్‌లో ఫాక్స్‌కాన్, టాటా ఎల్రక్టానిక్స్ సంస్థలు యాపిల్ ఫోన్లను తయారు చేస్తున్నాయి. గత రెండు నెలలుగా ఫాక్స్‌కాన్ ఇండియా యూనిట్లలో పని చేస్తున్న వందలకొద్దీ చైనా నిపుణులు స్వదేశానికి వెళ్లిపోయినట్లు సమాచారం. వీరంతా అసెంబ్లీ లైన్స్, ఫ్యాక్టరీ డిజైన్, ఇతరత్రా సిబ్బందికి శిక్షణనిచ్చే విధులు నిర్వర్తించేవారు.
దీనితో ఐఫోన్ల తయారీపై ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. కానీ, భారత్‌లో ఐఫోన్ల ఉత్పత్తిని 3.5–4 కోట్ల స్థాయి నుంచి ఈ ఏడాది 6 కోట్లకు పెంచుకోవాలన్న యాపిల్ టార్గెట్‌లో ఎలాంటి మార్పు లేదని సంబంధిత వర్గాలు వివరించాయి.