
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే ఇన్వెస్టర్లు రూ.25.46 లక్షల కోట్ల సంపదను సొంతం చేసుకున్నారు. బీఎస్‌ఈ చరిత్రలో ఈ మే 24న మొదటిసారిగా లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 3 లక్షల కోట్ల డాలర్ల(రూ.218 లక్షల కోట్లు)కు చేరింది. అలాగే జూన్ 15న రూ.232 లక్షల కోట్లకు చేరుకుని మార్కెట్ క్యాప్ విషయంలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇదే 3 నెలల్లో సెన్సెక్స్ సూచీ 2,973 పాయింట్లు(6%) లాభపడింది. ఈ జూన్ 28వ తేదిన 53,127 వద్ద జీవితకాల గరిష్టాన్ని, జూన్ 25 తేదీన 52,925 వద్ద ఆల్‌టైం హై ముగింపు స్థాయిని లిఖించింది.
ముంచేసిన మిడ్‌సెషన్ విక్రయాలు
మిడ్‌సెషన్ నుంచి విక్రయాలు వెల్లువెత్తడంతో స్టాక్ మార్కెట్ మూడోరోజూ నష్టాలతో ముగిసింది. ఒక్క ఐటీ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 67 పాయింట్ల నష్టంతో 52,483 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 427 పాయింట్ల పరిధిలో ట్రేడైంది. నిఫ్టీ 27 పాయింట్లను కోల్పోయి 15,721 వద్ద నిలిచింది. రూపాయి క్షీణత, ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూలతలు మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దేశీయ ఆటో కంపెనీలు నేడు(గురువారం)జూన్ నెల వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. జూన్‌కు సంబంధించిన పీఎంఐ డేటాను కేంద్రం విడుదల చేయనుంది. ఈ గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు.
ఐపీవోకు శ్రీరామ్ ప్రాపర్టీస్!
రియల్టీ రంగ బెంగళూరు కంపెనీ శ్రీరామ్ ప్రాపర్టీస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే సన్నాహాల్లో ఉంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జులై చివరి వారం లేదా ఆగస్ట్ తొలి వారంలోగా ఐపీవో చేపట్టాలని భావిస్తోంది. ఇందుకు వీలుగా ఏప్రిల్‌లోనే సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 550 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనుంది. అంతేకాకుండా మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ. 800 కోట్లను సమీకరించాలని ప్రణాళికలు వేసింది.
ఇక్కడ చదవండి:
16 రాష్ట్రాల్లో పీపీపీ మోడల్‌లో భారత్‌నెట్
జీఎస్‌టీతో తగ్గిన పన్నుల భారం