16 రాష్ట్రాల్లో పీపీపీ మోడల్‌లో భారత్‌నెట్‌

Cabinet approves FM Sitharaman Covid-19 stimulus package - Sakshi

కేంద్ర కేబినెట్‌ ఆమోదం

విద్యుత్తు సరఫరా వ్యవస్థ బలోపేతానికి డిస్కమ్‌లకు ఆర్థిక సాయం

సంస్కరణలు, ఫలితాల ఆధారంగా చేయూత

ఉద్దీపనలోని ఉపశమన చర్యలకు కేబినెట్‌ ఆమోదం

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కోవిడ్‌–19 ప్రభావిత రంగాలకు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలోని పలు పలు ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశ వివరాలను కేంద్ర మంత్రులు ప్రకాష్‌ జవదేకర్, రవిశంకర్‌ ప్రసాద్, ఆర్‌.కె.సింగ్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన పొడిగింపు
ఉద్యోగ కల్పనకు వీలుగా కొత్త నియామకాలకు యజమాని, ఉద్యోగుల చందాను కేంద్రం భరిస్తూ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌)కు చెల్లించడానికి వీలుగా ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజనను మార్చి 2022 వరకు పొడిగింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

భారత్‌నెట్‌ కోసం రూ .19,041 కోట్ల సాధ్యత గ్యాప్‌ నిధులు  
భారత్‌ నెట్‌ ద్వారా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం(పీపీపీ)లో రూ. 19,041 కోట్ల మేర వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌తో 16 రాష్ట్రాల్లోని గ్రామాల్లో బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు అందించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని టెలికం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.

16 రాష్ట్రాల్లోని 3,60,000 గ్రామాలను కవర్‌ చేయడానికి మొత్తం రూ . 29,430 కోట్లు ఖర్చవుతుంది. దేశంలోని 6 లక్షల గ్రామాలను 1,000 రోజుల్లో బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానం చేస్తామని 2020 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తరువాత ప్రైవేట్‌ భాగస్వాములను చేర్చుకునే నిర్ణయం తీసుకున్నట్లు రవిశంకర్‌ప్రసాద్‌ తెలిపారు. ఈ రోజు వరకు 2.5 లక్షల గ్రామ పంచాయతీలలో 1.56 లక్షల పంచాయతీలు బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానితమయ్యాయని ఆయన చెప్పారు.

విద్యుత్తు డిస్కమ్‌ల బలోపేతానికి రూ. 3.03 లక్షల కోట్ల వ్యయం
విద్యుత్తు సరఫరా వ్యవస్థ బలోపేతానికి సంస్కరణల ఆధారంగా, ఫలితాల ప్రాతిపదికన  డిస్కమ్‌లకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు రూ. 3.03 లక్షల కోట్ల విలువైన పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ సంబంధిత వివరాలు వెల్లడిస్తూ విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, దీనికి అనుగుణంగా రూ. 3.03 లక్షల కోట్ల విలువైన కొత్త పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపిందని, ఇందులో రూ. 97,631 కోట్ల మేర కేంద్రం ఖర్చు చేస్తుందని తెలిపారు.

సంస్కరణ ఆధారిత, ఫలితాల ప్రాతిపదికన పునరుద్ధరించిన విద్యుత్‌ పంపిణీ పథకాన్ని ఈ సంవత్సరం బడ్జెట్‌లో ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పన, వ్యవస్థ ఆధునీకరణ, సామర్థ్యం పెంపు, ప్రక్రియ మెరుగుదల కోసం డిస్కమ్‌లకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక్కో రాష్ట్ర పరిస్థితిని బట్టి వేర్వేరుగా రూపొందించిన కార్యచరణకు అనుగుణంగా ఆర్థిక సహాయం అందుతుంది. 25 కోట్ల  ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు అమర్చడం, వ్యవసాయానికి పగటి పూట కూడా విద్యుత్తు అందేలా రూ. 20 వేల కోట్లతో సౌర విద్యుత్తు పంపిణీకి వీలుగా 10 వేల ఫీడర్లను ఏర్పాటు చేయడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

లోన్‌ గ్యారంటీ స్కీమ్‌కు ఆమోదం
కోవిడ్‌ –19 మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే ప్యాకేజీలో భాగంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు రూ .1.5 లక్షల కోట్ల అదనపు రుణాలు ఇచ్చేలా ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీమ్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే ఆరోగ్య సంరక్షణ రంగానికి రూ. 50 వేల కోట్ల మేర, పర్యాటక సంస్థలకు, గైడ్‌లకు, ఇతర కోవిడ్‌ ప్రభావిత రంగాలకు రూ. 60 వేల కోట్ల మేర రుణాలు ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి ప్రకటించిన లోన్‌ గ్యారంటీ స్కీమ్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top