హెరిటేజ్‌కు సర్కారు రాయితీలు, సబ్సిడీలు..
మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ టెక్నాలజీ అప్ గ్రెడేషన్‌కు ఆమోదం
ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద కేబినెట్ పచ్చజెండా
రూ.200 కోట్ల పెట్టుబడికి రూ.100 కోట్ల రీయింబర్స్‌మెంట్..!
విద్యుత్ యూనిట్‌కు రూపాయి చొప్పున రాయితీ
ఐదేళ్ల పాటు 100% ఎస్‌జీఎస్టీ రీయింబర్స్‌మెంట్.. ఉపాధి 35 మందికే..
సాక్షి, అమరావతి: సంపద సృష్టించకుండా.. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకుండా.. సహజ వనరులను పచ్చ ముఠాలకు అప్పగించి ఇసుక, సిలికా, గ్రానైట్, క్వార్ట్జ్ దోపిడీకి తెర తీసిన చంద్రబాబు సర్కారు మరింత బరి తెగించింది! బినామీలకు 99 పైసలకే భూములను పందేరం చేస్తూ, నిర్మాణ వ్యయం కింద చదరపు అడుగుకు రూ.2,000 చొప్పున రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఖజానా నుంచి దోచిపెట్టి ఎదురు చెల్లిస్తూ, బంధు గణానికి విశాఖలో రూ.5 వేల కోట్ల విలువైన భూమిని రాసిచ్చిన ప్రభుత్వ పెద్దలు తాజాగా అన్ని విలువలకు తిలోదకాలిచ్చేశారు! దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ కనీసం ఆలోచన కూడా చేయని రీతిలో నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు ప్రయోజనాలు కలి్పస్తూ తాజాగా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తండ్రి, కుమారుడి సాక్షిగా హెరిటేజ్‌కు చేకూర్చిన లబ్ధి ఇలా ఉంది..!
ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందంటూ..
తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాదికి ముందు తన కుటుంబానికి సీఎం చంద్రబాబు తీపి కబురు వినిపించారు! ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్ధ హెరిటేజ్‌కు ప్రభుత్వం నుంచి భారీ రాయితీలు, సబ్సిడీలను కల్పిస్తూ శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని కేబినెట్ నిర్ణయాలు వెల్లడించే మీడియా సమావేశంలో మంత్రి పార్ధసారధి దాటవేయగా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో మాత్రం తెలియచేసింది.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశీపెంట గ్రామంలోని హెరిటేజ్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ టెక్నాలజీ అప్ గ్రెడేషన్ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద మెగా ప్రాజెక్టు హోదా పొందిన ఈ హెరిటేజ్ డెయిరీ అప్ గ్రెడేషన్ వల్ల ఉత్పత్తుల తయారీ భారీగా పెరగనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఫ్లేవర్డ్ పాలు 131 శాతం, పనీర్ 400 శాతం, నెయ్యి ఉత్పత్తి ఏకంగా 566 శాతం పెరగనుంది.
సభ సాక్షిగా అబద్ధాలు...!
‘‘హెరిటేజ్ మా కుటుంబ సంస్థ. మా కుటుంబ సభ్యులు దాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సంస్థకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్థి చేకూరలేదు. ప్రభుత్వ సహాయాన్ని కూడా కోరుకోలేదు. ఈ సంస్థ పెట్టినప్పుడే మేం ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రభుత్వం నుంచి ఏదీ ఆశించకూడదన్నదే మా విధానం. దానికి కట్టుబడే ఇప్పటి వరకు నడుచుకున్నాం..!’’ తాజా బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గంభీర ఉపన్యాసం ఇదీ! ఒకపక్క ప్రభుత్వం నుంచి ఆయాచిత ప్రయోజనాలు పొందుతూ అసెంబ్లీలో మాత్రం హెరిటేజ్‌కు ఎటువంటి లబ్ధి చేకూర్చడం లేదంటూ కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
సుమారు రూ.100 కోట్ల రాయితీ
చంద్రగిరి మండలం కాశీపెంట హెరిటేజ్ ఫుడ్స్ యూనిట్‌ను రూ.209.68 కోట్లతో అప్‌గ్రెడేషన్ చేసే ప్రతిపాదనను మెగా ప్రాజెక్టుగా ఆమోదిస్తూ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద చంద్రబాబు సర్కారు భారీ రాయితీలను కల్పించింది. ప్రత్యక్షంగా 35 మందికి మాత్రమే ఉపాధి కల్పించనున్నారు. ఐదేళ్లపాటు 100 శాతం ఎస్‌జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్తు రాయితీ, అప్‌గ్రెడేషన్ టెక్నాలజీపై సబ్సిడీ పేరుతో పెట్టుబడిపై 50 శాతం వరకు అంటే సుమారు రూ.100 కోట్ల వరకు రాయితీల రూపంలో వెనక్కి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వడ్డించేవాడు మనవాడు అయితే బంతిలో చివర కూర్చున్నా ఇబ్బంది లేదన్నట్లుగా సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేశ్ స్వయంగా పాల్గొన్న కేబినెట్ అజెండాలో చివరి అంశంగా హెరిటేజ్‌ను చేర్చి భారీ ప్రయోజనాలకు ఆమోద ముద్ర వేయించుకోవడం గమనార్హం.


