ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులు  | Investment in equity mutual funds fell nearly 14 per cent to Rs 32,994 crore in October | Sakshi
Sakshi News home page

ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులు 

Nov 12 2026 5:14 AM | Updated on Nov 12 2026 5:14 AM

Investment in equity mutual funds fell nearly 14 per cent to Rs 32,994 crore in October

అక్టోబర్‌లో 14 శాతం క్షీణత 

అయితే వరుసగా 68వ నెల నికరంగా పెట్టుబడుల ప్రవాహం 

యాంఫీ నివేదికలో వెల్లడి 

న్యూఢిల్లీ: గత నెల (అక్టోబర్‌) ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడులు రూ. 32,994 కోట్లకు పరిమితమయ్యాయి. సెప్టెంబర్‌ నాటి రూ. 38,306 కోట్లతో పోలిస్తే 14 శాతం తగ్గాయి. అయితే, ఈక్విటీ కేటగిరీలోకి నికరంగా పెట్టుబడులు రావడమనేది ఇది వరుసగా 68వ నెల కావడం గమనార్హం. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల సమాఖ్య యాంఫీ  నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మార్కెట్‌ హెచ్చుతగ్గులకు లోను కావడం వల్ల పెట్టుబడులు నెమ్మదించి ఉండొచ్చని, అయితే విదేశీ బ్రోకరేజీలు భారత ఈక్విటీలను రీ–రేటింగ్‌ చేయడం, ముడిచమురు ధరలు తగ్గడం తదితర అంశాలు సానుకూలంగా నిల్చాయని యాంఫీ సీఈవో వెంకట్‌ చలసాని తెలిపారు.

 అలాగే, కార్పొరేట్‌ ఆదాయాలు మెరుగుపడటం, బ్యాంకుల్లో రుణ వృద్ధి పెరగడంలాంటివి కూడా పెట్టుబడుల ప్రవాహం కొనసాగడానికి దోహదపడినట్లు వివరించారు. మార్కెట్లలో ఒడిదుడుకులు నెలకొన్నప్పటికీ సిప్‌ రూపంలో పెట్టుబడులు గతేడాది అక్టోబర్‌లో నమోదైన రూ. 29,000 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో దాదాపు 10% పెరిగినట్లు చెప్పారు.  గత నెలలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నికరంగా రూ. 34,843 కోట్ల మేర ఈక్విటీలను విక్రయించినట్లు ఆయన వివరించారు. అక్టోబర్‌లో మ్యుచువల్‌ ఫండ్‌ పరిశ్రమలోకి నికరంగా రూ. 1.74 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో మొత్తం నిర్వహణలోని ఆస్తుల పరిమాణం నెలవారీగా 1% పెరిగి రూ. 83.39 లక్షల కోట్లకు చేరాయి.  

యాంఫీ రిపోర్టులోని మరిన్ని విశేషాలు.. 
→ గోల్డ్, సిల్వర్‌ ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లోకి రూ. 3,000 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి.  
→ అక్టోబర్‌లో 28 న్యూ ఫండ్‌ ఆఫర్స్‌ సుమారు రూ. 3,829 కోట్లు సమీకరించాయి.  
→ ఈక్విటీ ఫండ్‌ ఏయూఎం సుమారు 6% పెరిగి రూ. 37.15 కోట్లకు చేరింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement