స్టాక్‌మార్కెట్‌లో కొత్తగా పెట్టుబడి పెట్టేవారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మార్కెట్‌లో నిర్ణయాలు తీసుకునే సమయంలో కొన్ని పదాలకు సరైన అర్థం తెలుసుకోకపోతే డబ్బు నష్టపోవాల్సి ఉంటుంది. కంపెనీలు తమ వ్యాపారాలు నిర్వహించాలంటే ఉబ్బు అవసరం అవుతుంది. ప్రమోటర్లు ఇన్వెస్ట్ చేసిన డబ్బు సంస్థ అవసరాలకు సరిపోదు. దాంతో సంస్థలో కొంత షేర్‌ను ఇన్వెస్టర్లకు ఇచ్చి దానివల్ల సమకూరే డబ్బుతో వ్యాపారం చేస్తాయి. కంపెనీలు సంపాదించే లాభంలో వారికి వాటా ఇస్తుంటాయి. ఈ క్రమంలో కొత్తగా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసినవారు, ఇకపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు తెలుసుకోవాల్సిన కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.
సెబీ
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) భారతీయ స్టాక్ మార్కెట్‌ను పర్యవేక్షిస్తోంది. కంపెనీలు, పెట్టుబడిదారులు, వ్యాపారులు, బ్రోకర్లు చేసే లావాదేవీలు, కార్యకలాపాలపై నిఘా వేయడానికి ఈ రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేశారు.
డీమ్యాట్ అకౌంట్
డీమ్యాట్ లేదా డీమెటీరియలైజ్డ్ ఖాతా, ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో కస్టమర్ షేర్లు, ఇతర సెక్యూరిటీలను కలిగి ఉండే సాధనం. డీమ్యాట్ ఖాతా ద్వారా కంపెనీ షేర్లను కొనడం లేదా విక్రయించడం లాంటివి చేయొచ్చు. భారత్‌లో షేర్ మార్కెట్ లావాదేవీల కోసం డీమ్యాట్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి.
స్టాక్ స్ప్లిట్
కంపెనీ షేరు ధర భారీగా పెరిగినా, ప్రైస్ టు ఎర్నింగ్ నిష్పత్తి ఎక్కువగా ఉన్నట్లు భావించినా ప్రస్తుత షేరును బహుళ షేర్లుగా విభజిస్తారు. ఉదాహరణకు ఒక కంపెనీ 1:2 స్టాక్ స్ప్లిట్‌ను ప్రకటిస్తే ప్రతి 1 షేరుకు పెట్టుబడిదారులు 2 అదనపు షేర్లు డీమ్యాట్‌లో చేరుతాయి.
బుల్/బేర్ మార్కెట్
బుల్ మార్కెట్‌లో కంపెనీల షేర్లను ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. దాంతో ఆ మార్కెట్‌లో షేర్ ధర పెరుగుతోంది. అయితే ఈ ట్రెండ్ చాలాకాలంపాటు కొనసాగుతుంటూ దాన్ని బుల్ మార్కెట్ అంటారు. ఇటీవల నెలకొన్న అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక అస్థిరత వల్ల మార్కెట్లు కుప్పకూలాయి. ఆ ట్రెండ్ కొంతకాలంపాటు సాగింది. దాన్ని బేర్ మార్కెట్ అంటాం.
స్టాక్ బ్రోకర్
కంపెనీలను సంప్రదించి నేరుగా షేర్లను కొనుగోలు చేసే ప్రక్రియ లేదు. కాబట్టి దీని కోసం స్టాక్ బ్రోకర్ అనే వ్యవస్థ ఉంది. ఈ స్టాక్‌బ్రోకర్లు తమ క్లయింట్స్ కోసం షేర్లను కొనుగోలు చేయడం, అమ్మడం చేస్తారు. ఉదాహరణకు జెరోధా, అప్‌స్టాక్స్, ఫయ్యర్స్.. వంటివి స్టాక్‌బ్రోకర్లుగా ఉన్నాయి.
డివిడెండ్
కంపెనీ త్రైమాసిక ఫలితాలు విడుదల చేసినపుడు లాభానష్టాలు ప్రకటిస్తాయి. లాభాలు ఆర్జించినప్పుడు దానిలో కొంత భాగాన్ని షేర్ హోల్డర్స్‌కు పంచుతాయి. కంపెనీలు పెట్టుబడిదారులకు స్వల్ప మొత్తంలో డివిడెండ్‌ను పంపిణీ చేస్తాయి. ఇది దీర్ఘకాలిక వాటాదారులకు ప్రధాన ఆదాయ వనరుగా మారుతుంది. డివిడెంట్ చెల్లింపులు నగదుగా, స్టాక్స్ లేదా వివిధ రూపాల్లో జారీ చేయొచ్చు.
ప్రైమరీ మార్కెట్/ఐపీఓ
ఒక కంపెనీ మొదటిసారి షేర్లను జారీచేసి మూలధనం సమకూర్చాలంటే ఐపీఓ ద్వారా మార్కెట్‌లో లిస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ షేర్ల జారీని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) అంటారు. కంపెనీలకు ఇది ఒక ముఖ్యమైన దశ. ఐపీఓ ద్వారా ఒక సంస్థకు సంబంధించిన షేర్లను కొనుగోలు చేయొచ్చు. ఐపీఓ ద్వారా సేకరించిన నిధులు నేరుగా కంపెనీకి వెళ్తాయి. కంపెనీ పెరుగుదలకు, విస్తరణకు ఉపయోగపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment