
గత వారమే ఒరెగాన్‌లో 500 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన చిప్ మేకర్ ఇంటెల్ మళ్లీ భారీగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. ది ఒరెగాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటెల్ ఒరెగాన్ స్టేట్‌లో దాదాపు 2,400 ఉద్యోగాలను తొలగించాలని యోచిస్తోంది. దీంతో ఈ నెలలో మొత్తం తొలగింపుల సంఖ్య 2,892కు చేరుకుంటుంది. యునైటెడ్ స్టేట్స్ అంతటా రాబోయే రోజుల్లో దాదాపు 4,000 మంది ఇంటెల్ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోతారని భావిస్తున్నారు. కొత్త సీఈఓ లిప్-బు టాన్ నేతృత్వంలో కంపెనీ వ్యయ తగ్గింపు చర్యల్లో భాగంగా ఈ తొలగింపులు జరుగుతున్నాయి.
ఇంటెల్ కార్యకలాపాలను సరళతరం చేయాలని, వ్యయాన్ని తగ్గించాలని యోచిస్తోంది. ఒకప్పుడు సెమీకండక్టర్ పరిశ్రమలో ఆధిపత్యం చెలాయించి ఇటీవల ప్రత్యర్థుల కంటే వెనుకబడిపోవడంతో సీఈఓపై ఒత్తిడి ఎక్కువైందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాంతో లేఆఫ్స్‌పై దృష్టి సారిస్తున్నారని చెబుతున్నారు. ఒరెగాన్ రాష్ట్రంలో ఇంటెల్ కార్యాలయంలో సుమారు 20,000 మంది కార్మికులు పని చేస్తున్నారు. తాజా తొలగింపులు స్థానిక ఉద్యోగుల్లో 12 శాతం మందిపై ప్రభావం చూపనున్నాయి.
ఇదీ చదవండి: ఇంటర్నెట్ స్పీడ్ పెంచి జపాన్ ప్రపంచ రికార్డు
ప్రభావిత ఉద్యోగుల్లో చిప్ ప్రొడక్ట్ డిజైనర్లు, క్లౌడ్ సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఫిజికల్ డిజైన్ ఇంజినీర్లు ఉన్నారు. కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను కూడా ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఉద్యోగాల కోతతో చిప్ తయారీలో కీలకంగా వ్యవహరించే ఇంటెల్ అంతర్గత ఫౌండ్రీ విభాగం తీవ్రంగా దెబ్బతింటుందని భావిస్తున్నారు. ఇటీవల ఇంటెల్ కాలిఫోర్నియా, అరిజోనా, టెక్సాస్‌లోని ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేసింది. సాఫ్ట్‌వేర్ నిర్వచించిన ప్లాట్‌ఫామ్‌లపై దృష్టి సారించిన కంపెనీ ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్‌లోని తన ఆటోమోటివ్ చిప్ యూనిట్‌ను మూసివేసింది. ఆ డివిజన్‌లో చాలా మంది ఉద్యోగులను కూడా తొలగించే అవకాశం ఉంది. ఉద్యోగ కోతలకు ముందస్తు పదవీ విరమణ ప్యాకేజీలు(ఎల్‌ఆర్‌ఎస్) అందించడం లేదు. దీనికి బదులుగా ఇంటెల్ తొమ్మిది వారాల వేతనం, ఇతర ప్రయోజనాలతో పాటు 60 రోజులు లేదా నాలుగు వారాల నోటీసును అందిస్తోంది.