
భారతదేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ 'ఇన్ఫోసిస్' బోనస్ విషయంలో ఉద్యోగులకు షాకిచ్చింది. క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితుల కారణంగా.. 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో అర్హులైన ఉద్యోగులకు 65 శాతం మాత్రమే బోనస్ చెల్లించనున్నట్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. గత త్రైమాసికం (మూడో త్రైమాసికం)లో 80 శాతం బోనస్ అందించిన కంపెనీ.. రెండో త్రైమాసికంలో 90 శాతం బోనస్ చెల్లింది.
2025 ఆర్ధిక సంవత్సరం రెండు, మూడు త్రైమాసికాలలో కంపెనీ ఉద్యోగులకు చెల్లించిన బోనస్.. నాల్గవ త్రైమాసికంలో చెల్లించనున్న బోనస్‌తో పోలిస్తే క్రమంగా తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. పర్ఫామెన్స్ బోనస్ మే 2025 సైకిల్‌లో ప్రాసెస్ అవుతుందని తెలుస్తోంది.
ఇక ఇన్ఫోసిస్ ఆఖరి త్రైమాసిక ఫలితాల విషయానికి వస్తే.. కంపెనీ లాభాలో అంతకు ముంది ఏడాది నాల్గవ త్రైమాసికం ఫలితాలతో పోలిస్తే 12 శాతం తగ్గి రూ. 7033 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం కంపెనీ నాల్గవ త్రైమాసిక ఫలితాల్లో సంస్థ లాభం రూ. 7696 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 40,925 కోట్లకు చేరింది. అంత క్రితం క్యూ4లో రూ. 37,923 కోట్ల టర్నోవర్ సాధించింది.
ఇదీ చదవండి: వారానికి 90 గంటల పని!.. ఆయనతో పనిచేయడం నా అదృష్టం
నియామకాలు
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోందని కంపెనీ సిఎఫ్‌ఓ జయేష్ సంఘ్రాజ్కా స్పష్టం చేశారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 6,388 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 323,578కి చేరుకుంది.