Economy: ఎకానమీలో వెలుగు రేఖలు

Industrial Output Growth Up Indian Economy - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఎకానమీ ఆర్థిక మూలాలు పటిష్టతను ప్రతిబింబిస్తూ తాజా గణాంకాలు విడుదలయ్యాయి. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సానుకూల రీతిలో 11.9 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఆగస్టులో ఐఐపీ సూచీ 117.2 వద్ద ఉంటే, 2021 ఆగస్టులో 131.1 పాయింట్లకు ఎగసింది. వెరసి వృద్ధి 11.9 శాతమన్నమాట.  ఇదిలాఉండగా, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 4.35 శాతంగా నమోదయ్యింది.

పారిశ్రామిక ఉత్పత్తి తీరిదీ.. 
జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన పారిశ్రామిక వృద్ధి గణాం కాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... 
► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70 శాతం  మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగం ఆగస్టు 2021లో 9.7 శాతం వృద్ధిని (2020 ఇదే నెల ఉత్పత్తితో పోల్చి) నమోదుచేసుకుంది.  
► మైనింగ్‌: ఉత్పత్తి 23.6 శాతం ఎగసింది.  
 విద్యుత్‌: ఉత్పత్తి విషయంలో వృద్ధి రేటు 16%.  
క్యాపిటల్‌ గూడ్స్‌: పెట్టుబడులకు, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తికి సంకేతమైన క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగం 19.9 శాతం పురోగమించింది. గత ఏడాది ఇదే నెలల్లో క్షీణత 14.4 శాతం.  
 కన్జూమర్‌ డ్యూరబుల్స్‌: ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజరేటర్లకు సంబంధించిన ఈ విభాగంలో 8% వృద్ధి నమోదయితే, గత ఏడాది ఇదే కాలంలో ఈ విభాగంలో 10.2% క్షీణత నెలకొంది. 
►  కన్జూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌: ఎఫ్‌ఎంసీజీ రంగానికి సంబంధించి ఈ విభాగంలో 3 శాతం క్షీణత 5.2 శాతం వృద్ధిలోకి మారింది.  
  ఎనిమిది మౌలిక రంగాలు:  మొత్తం సూచీలో దాదాపు 40 శాతం వాటా కలిగిన ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్‌  ఆగస్టులో 11.6 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. బొగ్గు, సహయ వాయువు రంగాల ఉత్పత్తిలో 20.6 శాతం పురోగతి నమోదయ్యింది.  సిమెంట్‌ రంగం 36.3% పురోగమించగా, స్టీల్‌ విషయంలో ఈ వృద్ధి శాతం 5.1 శాతంగా ఉంది. పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తి 9.1 శాతం పెరిగింది.  విద్యుత్‌ ఉత్పత్తి 15.3 శాతం ఎగసింది.  క్రూడ్‌ ఆయిల్‌ (మైనస్‌ 2.3 శాతం), ఎరువుల (మైనస్‌ 3.1 శాతం) పరిశ్రమలు మాత్రం ఇంకా వృద్ధి నమోదుకాకపోగా, క్షీణతను ఎదుర్కొన్నాయి. 

ఐదు నెలల్లో ఇలా... 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌–ఆగస్టు) ఐదు నెలల కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 28.6 శాతం. గత ఏడాది ఇదే కాలంలో 28.6 శాతం క్షీణత నమెదయ్యింది. 
కోవిడ్‌ సవాళ్లతో ఒడిదుడుకుల బాట మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్‌ 14, ఏప్రిల్‌ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్‌డౌన్‌ అమలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల బాటన పయనించింది. 2020 మార్చి (మైనస్‌ 18.7 శాతం) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకూ క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్‌ ఎఫెక్ట్‌ కారణంగా కనబడింది.  

కీలక గణాంకాలను పరిశీలిస్తే... బేస్‌ కూడా కారణమే!
తాజా సానుకూల గణాంకాలకు బేస్‌ కూడా కారణం కావడం గమనార్హం.  ‘పోల్చుతున్న నెలలో’  అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో  ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్‌ ఎఫెక్ట్‌.  ఇక్కడ బేస్‌ 2020 ఆగస్టు నెలను తీసుకుంటే కరోనా కష్టాలతో  ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా 7.1 శాతం క్షీణతను (2019 ఇదే కాలం ఉత్పత్తితో  పోల్చి) నమోదుచేసుకుంది.

ఇక ఎనిమిది పరిశ్రమల గ్రూప్‌ కూడా 2020 ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా 6.9 శాతం క్షీణతను ఎదుర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకూ ఎనిమిది రంగాల పురోగతి 19.3 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో కరోనా కష్టాలతో ఈ గ్రూప్‌ వృద్ధి లేకపోగా 17.3% క్షీనత నమోదయ్యింది.

5 నెలల కనిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం
ఇక సెప్టెంబర్‌లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కు ప్రభుత్వం ఇస్తున్న నిర్దేశాలకు అనుగుణంగా 4.35 శాతంగా నమోదయ్యింది. గడచిన ఐదు నెలల్లో ఈ స్థాయి రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి (2021 ఏప్రిల్‌లో 4.23 శాతం). కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలు తగ్గాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.3 శాతం.

అయితే, గత ఏడాది సెప్టెంబర్‌లో 7.27 శాతంగా ఉంది. తాజా సమీక్షా నెలలో ధరల స్పీడ్‌ విషయానికి వస్తే... ఆహార ద్రవ్యోల్బణం 0.68 శాతంగా ఉంది. ఆగస్టులో ఈ రేటు 3.11 శాతం. ఒక్క కూరగాయల బాస్కెట్‌ 22.47 శాతం పడిపోయింది. ఆగస్టులో ఈ తగ్గుదల 11.68 శాతం. ఇంధనం, లైట్‌ విభాగంలో మాత్రం రిటైల్‌ ద్రవ్యోల్బణం 12.95 శాతం (ఆగస్టు) 13.63 శాతానికి పెరిగింది.  దేశ ఆర్థిక పటిష్టతకు రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలని కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సరళరత వడ్డీరేట్ల విధానానికి సీపీఐ ఈ స్థాయిలో కొనసాగడం కీలకం.. రిటైల్‌ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందన్న భరోసాతో వృద్ధే లక్ష్యంగా గడచిన ఎనిమిది ద్వైమాసిక సమావేశాల్లో ఆర్‌బీఐ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు – ప్రస్తుతం 4 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది.

 రిటైల్‌ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగలు 5.7 శాతం  ఉంటుందన్న క్రితం అంచనాలను ఈ నెల మొదట్లో ఆర్‌బీఐ  5.3 శా>తానికి కుదించింది. 2021–22 రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1%, 4.5%, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్‌బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2% నమోదవుతుందని భావిస్తోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top