
దీపావళి.. దేశంలో అతిపెద్ద పండుగ. ఈ పర్వదినాన్ని పుస్కరించుకుని దేశవ్యాప్తంగా చాలా కంపెనీలు బోనస్‌లు, బహుమతులు (Diwali Gifts) ఇస్తుంటాయి. కొన్ని సంస‌్థలు కేవలం స్వీట్ బాక్స్ లతోనే సరిపెట్టేస్తుంటాయి. మరి కొన్ని కంపెనీలు అయితే అవి కూడా లేకుండా ఉద్యోగులకు వట్టి చేతులు చూపిస్తుంటాయి. కేవలం కొన్ని కంపెనీలే తమ ఉద్యోగులకు గుర్తుండిపోయేలా బహుమతులిచ్చి ఆశ్చర్యపరుస్తుంటాయి.
భారతీయ టెక్నాలజీ సంస్థ ఇన్ఫో ఎడ్జ్ (Info Edge) తన ఉద్యోగులకు ఇచ్చిన దీపావళి బహుమతులపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఉద్యోగులు స్వయంగా చిత్రీకరించిన అనేక ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వైరల్ అవుతున్నాయి, సంస్థ వారికిచ్చిన రిచ్ గిఫ్ట్ హ్యాంపర్స్‌ను హైలైట్ చేస్తున్నాయి.
వీడియోలలో ప్రతి ఉద్యోగి తమ వర్క్‌స్టేషన్ వద్దకు రాగానే, వీఐపీ బ్రాండెడ్ సూట్‌కేస్, స్నాక్స్ బాక్స్, సాంప్రదాయ దీపం (దియా) అమర్చి ఉండటం కనపడుతోంది. ఆఫీసు అంతటా పండుగ శోభను సంతరించుకుని, డెస్కులు అందంగా అలంకరించి ఉన్నాయి.
వైరల్‌గా మారిన దీపావళి గిఫ్ట్ రీల్స్
తమ సంస్థ ఇచ్చిన గిఫ్ట్‌లను చూపుతూ ఉద్యోగులు చేసిన రీల్స్ సోషల్ మీడియా లో వైరల్‌గా మారాయి. ఉద్యోగులు కార్యాలయానికి రాగానే తీసిన వీడియోలలో, బహుమతులను చూస్తూ వారు ఆశ్చర్యపోతున్న క్షణాలు బంధించారు. కొన్ని క్లిప్‌లలో ఉద్యోగులు సూట్‌కేస్ తెరిచి చూపించారు. లోపల మరొక చిన్న సూట్‌కేస్ ఉంది. అలాగే స్నాక్స్ బాక్స్ లను అన్‌బాక్స్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. గత ఏడాది కూడా ఈ సంస్థ ఉద్యోగులకు ఎయిర్‌ఫ్రైయర్‌లు బహుమతులుగా ఇచ్చినట్లు తెలిపారు.
నెటిజన్ల స్పందనలు
ఈ వీడియోలు వైరల్ కావడంతో, సోషల్ మీడియా కామెంట్లు వ్యంగ్యంతో పాటు అసూయతో నిండిపోయాయి. “నేను నా ఆఫీస్ నుండి వచ్చిన కాజు బర్ఫీ బాక్స్‌ని చూస్తూ ఈ వీడియోను చూస్తున్నాను” ఒకరు కామెంట్ చేయగా “దీనిని నా మేనేజర్‌కి చూపించాను. ఆయన ఇది ఏఐ అన్నాడు!” మరో వ్యక్తి హాస్యంగా కామెంట్ చేశారు.
కంపెనీ గురించి..
ఇన్ఫో ఎడ్జ్ సంస్థను 1995లో సంజీవ్ బిఖ్చందానీ స్థాపించారు. ఇది నౌకరి, 99ఎకర్, జీవన్ సాథీ, శిక్షిక.కామ్ వంటి ప్రధాన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌ను నిర్వహిస్తోంది. అలాగే, పలు స్టార్ట్‌అప్‌లలో కూడా పెట్టుబడులు పెట్టింది. సంస్థ ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంది.
ఇదీ చదవండి: ఈ కంపెనీల్లో కెరియర్‌కు తిరుగులేదు! లింక్డ్ఇన్ లేటెస్ట్ లిస్ట్