ఓటీటీ .. పరిశ్రమ సూపర్‌ హిట్‌.. ఆదాయంలో దక్షిణాది సినిమాల జోరు!

Indian OTT market set to reach Rs 30000 crore by 2030 - Sakshi

2030 నాటికి రూ.30వేల కోట్లకు

ప్రస్తుత మార్కెట్‌ రూ.10వేల కోట్లు

ఏటా 20 శాతం చొప్పున వృద్ధి

పరిశ్రమ వర్గాల అంచనా

న్యూఢిల్లీ: ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) కంటెంట్‌ పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్‌ విలువ రూ.10,000 కోట్లుగా ఉంటే, 2030 నాటికి రూ.30,000 కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2024 మార్చి నాటికి రూ.12,000 కోట్లకు చేరుకుంటుందని, ఏటా 20 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఐఎన్‌10మీడియా సీవోవో, సీఐఐ దక్షిణ్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడైన అనూప్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. ఓటీటీ పరిశ్రమపై చెన్నైలో దక్షిణాది మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సీఐఐ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘‘ప్రస్తుతం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలవుతున్న వాటితో పోలిస్తే.. వచ్చే 12 నెలల్లో దక్షిణాది భాషల్లో పెద్ద సంఖ్యలో వెబ్‌ సిరీస్‌లు విడుదల కానున్నాయి’’అని స్టార్‌/డిస్నీ ఇండియా బిజినెస్‌ హెడ్‌ కృష్ణన్‌ కుట్టి తెలిపారు.  

దక్షిణాది సినిమాల జోరు
దేశం మొత్తం మీద దక్షిణాది సినిమాలు అత్యధిక ఆదాయాన్ని సృష్టిస్తున్నాయి. 2022లో దక్షిణాది సినిమాలు రూ.7,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి. అంతకుముందు ఏడాది ఆదాయంతో పోలిస్తే రెట్టింపు అయింది. అంతేకాదు గతేడాది దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ ఆదాయంలో దక్షిణాది సినిమాల వాటాయే 50 శాతంగా ఉండడం గమనార్హం. ఈ వివరాలను సీఐఐ దక్షిణాది విభాగం రూపొందించిన నివేదికలో పేర్కొంది. ‘తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంతో కూడిన దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆదాయం 2022లో రూ.7,836 కోట్లుగా ఉంది. 2021లో ఆదాయం రూ.3,988 కోట్టే. 2022లో మొత్తం భారత సినీ పరిశ్రమ ఆదాయం రూ.15,000 కోట్లు. దక్షిణాదిలోనూ తమిళ సినిమా రూ.2,950 కోట్లతో అగ్ర స్థానంలో నిలిచింది.

ఆ తర్వాత రూ.2,500 కోట్లతో తెలుగు సినీ పరిశ్రమ ఉంటే, కన్నడ పరిశ్రమ ఆదాయం రూ.1,570 కోట్లు, మలయాళ పరిశ్రమ ఆదాయం రూ.816 కోట్లు. ముఖ్యంగా కన్నడ నాట కేజీఎఫ్‌:చాప్టర్‌ 1, కాంతార సినిమాలు బంపర్‌ వసూళ్లతో పరిశ్రమ రూపాన్ని మార్చేశాయి’అని నివేదిక తెలిపింది. మలయాళ పరిశ్రమ స్థానికంగా, విదేశాల్లోనూ ఆదాయాన్ని పెంచుకుంది. దర్శకుడు రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఒక్కటే రూ. 1,200 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. కమల్‌ హాసన్‌ విక్రమ్, మణిరత్నం పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాలు తమిళనాట ఆదాయాన్ని పెంచాయి. 2022 లో దక్షిణాదిన 916 సినిమాలు విడుదలయ్యాయి. థియేటర్, ఓటీటీలో విడుదలైనవీ ఇందులో ఉన్నాయి.

కంటెంట్‌కు డిమాండ్‌
స్క్రిప్ట్‌ను అందించేందుకు తాము ఒక నెల సమయం తీసుకుంటున్నామని అర్హ మీడియా అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ సహ వ్యవస్థాపకుడు అజిత్‌ ఠాకూర్‌ తెలిపారు. ప్రస్తుతం ఏటా వివిధ ప్లాట్‌ఫామ్‌ల కోసం 60 ఒరిజినల్స్‌ అవసరం ఉంటోందన్నారు. నిర్మాతలు దీన్ని అవకాశంగా తీసుకోవాలని కోరారు. ‘‘తమిళం, తెలుగు ఓటీటీపైనే జీ ఓటీటీ ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించింది. ప్రస్తుతం కన్నడ ఓటీటీ మార్కెట్‌ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. మలయాళం ఓటీటీ పరిశ్రమకు కావాల్సిన కంటెంట్‌ను ప్రస్తుతం నిర్మాతలు అందించే స్థితిలో ఉన్నారు’’అని జీ5 ఓటీటీ చీఫ్‌ క్లస్టర్‌ ఆఫీసర్‌ సిజు ప్రభాకరన్‌ వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top