కష్టాల కడలి, రూ.70,820 కోట్లకు ఎయిరిండియా నష్టాలు

Indian Airlines Has Accumulated Losses To The Tune Of Rs70,820 Crore - Sakshi

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా నష్టాలు 2020 మార్చి 31 నాటికి రూ. 70,820 కోట్లకు చేరినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ రాజ్యసభకు తెలిపారు. 2007లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌తో విలీనం చేసినప్పట్నుంచీ సంస్థ నష్టాల్లోనే ఉన్నట్లు వివరించారు. ఎయిరిండియా విక్రయా నికి సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్‌ 15లోగా ఆసక్తి గల బిడ్డర్ల నుంచి ఆర్థిక బిడ్లు రాగలవని భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సంస్థను విక్రయించేందుకు గతేడాది జనవరి 27న కేంద్రం బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తికరణ పత్రాలను ఆహ్వానించింది. కోవిడ్‌–19 పరిస్థితుల నేపథ్యంలో బిడ్ల దాఖలుకు డెడ్‌లైన్‌ను పొడిగిస్తూ వచ్చింది.  

విమానాశ్రయాల చట్ట సవరణల బిల్లుకు ఆమోదం
ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనమిక్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సవరణ) బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. వివిధ అంశాలపై విపక్షాల నిరసనల మధ్య స్వల్ప చర్చ అనంతరం రాజ్యసభ దీనికి ఆమోదముద్ర వేసింది. మారుమూల ప్రాంతాల్లోనూ విమాన సేవలు అందుబాటులోకి తెచ్చే దిశగా చిన్న విమానాశ్రయాల కార్యకలాపాల విస్తరణను ప్రోత్సహించే ఉద్దేశంతో దీన్ని ప్రతిపాదించారు.  

షిప్పింగ్‌ పోర్టులపై పార్లమెంటరీ కమిటీ నివేదిక..
దేశీయంగా కొత్త పోర్టుల ఏర్పాటు అవకాశాలను గుర్తించి, వాటిని అభివృద్ధి చేసేందుకు తగు ప్రతిపాదనలతో ప్రభుత్వాన్ని సంప్రదించే స్వేచ్ఛ షిప్పింగ్‌ రంగంలోని ప్రైవేట్‌ సంస్థలకు ఉండాలని పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొంది. కంటైనర్లను వేగవంతంగా ఖాళీ చేసేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్టు (జేఎన్‌పీటీ)లో రైల్‌ యార్డును అభివృద్ధి చేసే అంశం పరిశీలించాలని ఒక నివేదికలో సూచించింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top