
ధరలు తగ్గడంతో 2025–26లో ఆదా
బ్యారెల్ ధర 60–70 డాలర్లు ఉండొచ్చు
రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా
న్యూఢిల్లీ: చమురు ధరలు కనిష్ట స్థాయికి చేరిన క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు వీటి దిగుమతులపై రూ.1.8 లక్షల కోట్ల మేర ఆదా అవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల రూపంలోనే సమకూరుతుండడం తెలిసిందే. వీటి దిగుమతుల కోసం భారత్ 2024–25లో 242.4 బిలియన్ డాలర్లను (రూ.20.60 లక్షల కోట్లు) వెచ్చించినట్టు ఇక్రా నివేదిక తెలిపింది.
ఎల్‌ఎన్‌జీ దిగుమతుల కోసం 15.2 బిలియన్ డాలర్లు (రూ.1.29 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్టు పేర్కొంది. ఈ వారంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర 60.23 డాలర్ల కనిష్టానికి చేరుకోవడం గమనార్హం. 2021 ఫిబ్రవరి తర్వాత కనిష్ట స్థాయికి చమురు ధరలు చేరుకుకోవడం మళ్లీ ఇదే మొదటిసారి. 2024 మార్చితో పోల్చి చూసుకున్నా బ్యారెల్ ముడి చమురు ధర 20 డాలర్లు తక్కువగా ఉంది.
నాడు పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.2 చొప్పున తగ్గించడం తెలిసిందే. 2025–26 సంవత్సరంలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 60–70 డాలర్ల మధ్య ఉండొచ్చని ఇక్రా అంచనా వేసింది. ఈ ధరల ప్రకారం అప్‌స్ట్రీమ్ ఆయిల్ కంపెనీలకు (ముడి చమురు ఉత్పత్తి సంస్థలు) రూ.25,000 కోట్ల మేర పన్నుకు ముందు లాభం సమకూరుతుందని అంచనా వేసింది. ఇక ఎల్‌ఎన్‌జీ దిగుమతులపై రూ.6,000 కోట్లు, ముడి చమురు దిగుమతులపై రూ.1.8 లక్షల కోట్ల చొప్పున మిగులుతుందని పేర్కొంది. ఆయిల్ మార్కెటింగ్ (రిటైల్) సంస్థలకు మార్జిన్లు మెరుగ్గా ఉంటాయని.. ఎల్‌పీజీపై నష్టాలు తగ్గుతాయని వెల్లడించింది.