
భారత కంపెనీలతో భాగస్వామ్యానికి ఖతార్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. కేవలం పెట్టుబడులకే పరిమితం కాకుండా, ఇతర దేశాల్లో ప్రాజెక్టులను భారత కంపెనీల భాగస్వామ్యంతో చేపట్టేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు చెప్పారు. ఒక్క రోజు పర్యటన కోసం వ్యాపార ప్రతినిధి బృందంతో మంత్రి గోయల్ ఖతార్‌కు వచ్చిన సందర్భంగా మాట్లాడారు.
ఖతార్‌కు చెందిన ఆల్ బలఘ్ ఎల్‌అండ్‌టీ భాగస్వామిగా ఉందన్న ఉదాహరణను ప్రస్తావించారు. ఈ ఇరు సంస్థలు కలసి ఖతార్‌లో ప్రాజెక్టులను పూర్తి చేశాయని, ఇతర దేశాల్లోనూ సంయుక్తంగా ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు చెప్పారు. ఖతార్ ప్రభుత్వం మూడో పక్ష దేశాల్లో ప్రాజెక్టులపై దృష్టి పెట్టిందని, ఇదే విషయాన్ని తనకు చెప్పినట్టు పేర్కొన్నారు. ఖతారీ డెవలప్‌మెంట్‌బ్యాంక్ నిధులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కనుక భారత కంపెనీలు ఈ అవశాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఖతార్‌తో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 2024–25లో 14.15 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం.
అమెరికాతో ఒప్పందంపై చర్చలు
ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) అమెరికా–భారత్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నవంబర్ చివరికి చర్చలు ముగించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని అవకాశాలున్నట్టు చెప్పారు. తదుపరి విడత చర్చలు భౌతికంగా జరిగేందుకు ఉన్న అవకాశాలను తోసిపుచ్చలేదు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ (మూసివేత)ను ఎదుర్కొంటున్నందున, తదుపరి దశ చర్చలు ఎలా, ఎక్కడ నిర్వహించేదీ చూడాల్సి ఉందన్నారు. నిధుల మంజూరునకు కాంగ్రెస్ ఆమోదం పొందలేకపోవడంతో అక్టోబర్ 1 నుంచి అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోవడం తెలిసిందే.
ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ!