
పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ దాడి చేసిన నేపథ్యంలో స్థానిక విమానాశ్రయాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దేశంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య ప్రాంతాల్లోని 27 విమానాశ్రయాలు మే 10 వరకు వాణిజ్య కార్యకలాపాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో విమాన ప్రయాణాల్లో అంతరాయం ఏర్పడనుంది. ఈ చర్య ఫలితంగా భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 430 ఎయిర్‌క్రాఫ్ట్‌లు రద్దు అయినట్లు తెలిసింది. ఇది దేశంలోని మొత్తం షెడ్యూల్డ్ విమానాల్లో 3%గా ఉంది. ఈ ప్రభావం ఒక్క ఇండియాకు మాత్రమే పరిమితం కాలేదు. పాకిస్థాన్‌లోని విమానయాన సంస్థలు కూడా 147 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఇది వారి రోజువారీ షెడ్యూల్‌లో 17%గా ఉంది.
ఇదీ చదవండి: ఉగ్రదేశం మదం అణచిన ఫైటర్ జెట్‌లు
దేశంలోని ప్రభావిత విమానాశ్రయాలు..
శ్రీనగర్, జమ్మూ, లేహ్, చండీగఢ్, అమృత్‌సర్, లుధియానా, పాటియాలా, బటిండా, హల్వారా, పఠాన్‌కోట్, భుంతర్, సిమ్లా, గగ్గల్, ధర్మశాల, కిషన్‌గఢ్, జైసల్మేర్, జోద్‌పూర్, బికనీర్, ముంద్రా, జామ్‌నగర్, రాజ్‌కోట్, పోర్‌బందర్, కాండ్లా, గ్వాలియర్, హిండన్ సహా కీలక వ్యూహాత్మక విమానాశ్రయాలను మూనివేస్తున్నట్లు చెప్పారు. విమాన రాకపోకల్లో అంతరాయాలను తగ్గించడానికి సంస్థలు పని చేస్తున్నట్లు తెలిపాయి. విదేశీ విమానయాన సంస్థలు సున్నితమైన జోన్లలో కార్యకలాపాలను పూర్తిగా నిలిపేసి ముంబై, అహ్మదాబాద్ మీదుగా ప్రయాణించే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి. విమానయాన సంస్థలు షెడ్యూళ్లను సర్దుబాటు చేయడానికి, ప్రభావిత ప్రయాణీకులకు వసతి కల్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల ప్రయాణాల్లో ఆలస్యం అనివార్యం అవుతుంది.
