రూ. 345 కోట్లతో ఫ్లైఓవర్
మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్, ఆరాంఘర్‌ల వద్ద సిగ్నల్ ఫ్రీగా..
త్వరలో పనులు ప్రారంభం
సాక్షి,హైదరాబాద్: విస్తరిత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)లో ట్రాఫిక్ జాంఝాటాలు తప్పించేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్‌బీనగర్ వైపుల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వెళ్లే వాహనాలు సిగ్నల్ ఫ్రీగా వెళ్లేందుకు రూ.345 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్‌ఎంసీ భారీ ప్రాజెక్ట్ చేపట్టేందుకు సిద్ధమైంది. హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్ట్ కింద ఆరు లేన్లతో ఎలివేటెడ్ కారిడార్(ఫ్లై ఓవర్) పనులు త్వరలో ప్రారంభించనుంది. ఈ మేరకు టెండర్లు ఆహ్వానించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్ రోడ్, కాటేదాన్ జంక్షన్‌ల వద్ద ఆగకుండా రెండు వైపులా సాఫీగా ప్రయాణం సాగేందుకు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. షాద్‌నగర్, మహబూబ్‌నగర్, అత్తాపూర్, మెహదీపట్నం వైపు వెళ్లేవారికి కూడా ఇది అనువుగా ఉంటుంది. ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు అధికారులు చెప్పారు. కాటేదాన్ జంక్షన్ వద్ద మూడు లేన్లతో డౌన్‌ర్యాంప్ ఉంటుంది. టెండర్ ద్వారా ప్రాజెక్ట్ దక్కించుకునే ఏజెన్సీయే సర్వే, డిజైన్, డ్రాయింగ్స్, నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. కాంట్రాక్టు అగ్రిమెంట్ జరిగినప్పటి నుంచి రెండు సంవత్సరాల్లో పనులు పూర్తి కావాలి. యుటిలిటీ షిఫ్టింగ్, ఫుట్‌పాత్‌లు, ల్యాండ్‌స్కేపింగ్, సైనేజీలు, లైటింగ్, పేవ్‌మెంట్ మార్కింగ్స్ తదితర పనులు కూడా చేయాలి.
మెట్రోకు సమాంతరంగా..
ఎయిర్‌పోర్ట్ మెట్రోలైన్‌కు పక్క నుంచి ఈ ఫ్లై ఓవర్ రానుంది. ఫ్లై ఓవర్ కంటే మెట్రోమార్గం ఎక్కువ ఎత్తులో ఉంటుంది. దీంతోపాటు టీకేర్ కాలేజ్ జంక్షన్, గాయత్రినగర్ జంక్షన్, మంద మల్లమ్మ జంక్షన్‌ల మీదుగా ఆరు లేన్లతో మరో ఫ్లైఓవర్ పనులకు టెండర్ల గడువు ముగిసింది. టెండర్లు ఖరారు కావాల్సి ఉంది.


