భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం | india-eu-free-trade-agreement-talks-final-stage | Sakshi
Sakshi News home page

భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

Jan 26 2026 12:03 PM | Updated on Jan 26 2026 1:03 PM

india-eu-free-trade-agreement-talks-final-stage

భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య చాలా రోజులుగా ఊరిస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ఒప్పందంపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని ఈయూ ట్రేడ్ కమిషనర్ మారోస్ సెఫ్కోవిచ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అనంతరం సెఫ్కోవిచ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘గత ఏడాది కాలంగా జరుగుతున్న నిరంతర సంప్రదింపులు ఈ ఒప్పందం ప్రాధాన్యతను చాటుతున్నాయి. చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని నమ్మకంగా చెప్పగలను’ అని పేర్కొన్నారు.

గణతంత్ర వేడుకల వేళ కీలక పరిణామాలు

ప్రస్తుతం భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఈయూ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా న్యూఢిల్లీ పర్యటిస్తున్నారు. మంగళవారం జరగనున్న భారత్‌-ఈయూ శిఖరాగ్ర సమావేశం ఈ ఒప్పందానికి సంబంధించి అత్యంత కీలకం కానుంది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇప్పటికే ఈయూ నేతలతో భేటీ అయ్యారు. ప్రధాని మోదీతో చర్చలు భారత్‌-ఈయూ సంబంధాల్లో సరికొత్త అధ్యాయం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మదర్ ఆఫ్ ఆల్ డీల్స్

ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశంలో ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ ఒప్పందాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా అభివర్ణించడం దీని ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.

భారత ప్రయోజనాలు

టెక్స్‌టైల్స్‌, లెదర్, ఫుట్‌వేర్ వంటి రంగాలకు యూరప్ మార్కెట్లలో భారత్‌ ఎగుమతులకు సున్నా సుంకం (Zero Duty) లభించే అవకాశం ఉంది. దాంతో బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో భారత ఎగుమతిదారులు దీటుగా పోటీ పడవచ్చు. ఇదిలాఉండగా, వైన్‌, ఇతర మద్యపాన పానీయాలపై టారిఫ్ తగ్గించాలని ఈయూ డిమాండ్‌ చేస్తోంది. యూరోపియన్ ప్రీమియం కార్ల కోసం ప్రత్యేక కోటా వ్యవస్థ ఉండాలని కోరుతోంది.

ప్రధాన సవాళ్లు

చర్చలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ సుస్తిరత అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా ఈయూ ప్రతిపాదించిన ‘కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (CBAM)’ వల్ల భారతీయ ఎగుమతిదారులపై పడే అదనపు భారం గురించి ఇరు పక్షాలు సుదీర్ఘంగా చర్చిస్తున్నాయి. సాధారణంగా వస్తువుల తయారీలో ఎంత మేర గ్రీన్ హౌస్ వాయువులు (ముఖ్యంగా కార్బన్‌డయాక్సైడ్) విడుదలయ్యాయో లెక్కగట్టి దాని ఆధారంగా ఈ పన్ను విధిస్తారు.

ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement