
వీటిపై జెనరేటివ్, ఏజెంటిక్ ఏఐల ప్రభావం
క్రెడిట్ కార్డు చెల్లింపులూ పెరుగుతాయ్
పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో శరవేగంగా పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులపై జెనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ గణనీయమైన ప్రభావం చూపించనున్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. యూపీఐ ఇకపైనా కీలకంగా ఉంటుందంటూ.. అదే సమయంలో తదుపరి దశ డిజిటల్ చెల్లింపులను క్రెడిట్‌కార్డులు, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) నడిపించొచ్చని అంచనా వేసింది.
ఫిన్‌టెక్, చెల్లింపుల రంగంలో కీలక స్థానాల్లో ఉన్న 175 మంది అభిప్రాయాలను పీడబ్ల్యూసీ ఇండియా తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. క్రెడిట్ కార్డు కీలక విభాగంగా ఉంటుందని 65 శాతం మంది చెప్పారు. కార్డు చెల్లింపులు బలంగా వృద్ధి చెందుతాయని 95 శాతం మంది భావిస్తున్నారు. చెల్లింపుల వ్యవస్థ ముఖచిత్రంపై జెనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ ఎంతో ప్రభావం చూపించనున్నట్టు 73 శాతం మంది చెప్పారు.
ఐదేళ్లలో మూడింతలు
భారత్‌లో డిజిటల్ చెల్లింపులు ఇక మీదట అధిక వృద్ధి వేగంతో కొనసాగుతాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. 2030 మార్చి నాటికి మూడింతలు అవుతాయని అంచనా వేసింది. ఆవిష్కరణలకుతోడు రుణ సేవల విస్తరణ, నియంత్రణ సంస్థల మద్దతు, సరికొత్త టెక్నాలజీలను స్వీకరించడం, మారుతున్న వినియోగదారుల వైఖరి డిజిటల్ చెల్లింపుల వేగాన్ని నడిపిస్తాయని పేర్కొంది.
‘‘భారత్‌లో చెల్లింపుల ఎకోవ్యవస్థ కొత్త దశలోకి అడుగుపెడుతోంది. వచ్చే ఐదేళ్లలో యూపీఐ ఆవిష్కరణలు, సేవల విస్తరణ కొనసాగుతుంది. రుణాల్లో వృద్ధి, బీమా, సంపద కలయికతో డిజిటల్ చెల్లింపులు పెరుగుతాయి’’అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్ మిహిర్‌గాంధీ తెలిపారు. వివిధ సాధనాల మధ్య అనుసంధానత ద్వారా ఆవిష్కరణలు–విస్తరణ మధ్య సమతూకం ఉండేలా చూడడం అవసరమన్నారు.
90% చెల్లింపులవే..
భారత డిజిటల్ చెల్లింపులకు యూపీఐ వెన్నెముకగా నిలుస్తున్నట్టు, 2024–25లో రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 90 శాతం యూపీఐ రూపంలోనే ఉన్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. క్రెడిట్ కార్డు లావాదేవీలు 2023–24లో 100 మిలియన్ దాటగా, 2030 మార్చి నాటికి 200 మిలియన్‌కు చేరుకుంటాయని పేర్కొంది. వినియోగదారులు యూపీఐ, క్రెడిట్‌కార్డులకు ప్రాధాన్యం ఇస్తుండడంతో డెబిట్ కార్డుల వినియోగం ఇకమీదటా తగ్గనున్నట్టు తెలిపింది.