ఏఐ ఏజెంట్లతో షాపింగ్.. మాస్టర్‌ కార్డ్ ఏజెంటిక్ కామర్స్ విప్లవం! | Mastercard Unveils AI‑Powered Agentic Commerce Framework At India AI Impact Summit 2026, More Details Inside | Sakshi
Sakshi News home page

ఏఐ ఏజెంట్లతో షాపింగ్.. మాస్టర్‌ కార్డ్ ఏజెంటిక్ కామర్స్ విప్లవం!

Feb 23 2026 11:34 AM | Updated on Feb 23 2026 11:57 AM

Mastercard unveiled Agentic Commerce framework

కృత్రిమ మేధ(ఏఐ) కేవలం సమాధానాలు ఇచ్చే స్థాయి నుంచి మన తరఫున పనులు పూర్తి చేసే ఏజెంటిక్ స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ వేదికగా మాస్టర్ కార్డ్ తన వినూత్న ఏజెంటిక్ కామర్స్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆవిష్కరించింది. కేవలం వస్తువులను సిఫార్సు చేయడమే కాకుండా వినియోగదారుడి అవసరాలను గుర్తించి బేరసారాలు ఆడి, సురక్షితంగా లావాదేవీలను పూర్తి చేసే సామర్థ్యం దీని సొంతం. ఈ సందర్భంగా మాస్టర్ కార్డ్ ఏఐ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నితేంద్ర రాజ్‌పుత్‌ కొన్ని అంశాలు వెల్లడించారు.

స్థానిక భాషల్లో ఆర్థిక లావాదేవీలు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండియా ఏఐ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా మాస్టర్ కార్డ్ తన ఏజెంటిక్ వ్యవస్థను రూపొందించింది. కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులకు సైతం ఏఐ ప్రయోజనాలను అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ వ్యవస్థలో వినియోగదారుడు మొదటగా తనకిష్టమైన భాషను ఎంచుకోవచ్చు. వాయిస్ సపోర్ట్‌తో కూడిన ఈ టెక్నాలజీ వివిధ భారతీయ భాషల్లో సంభాషించగలదు.

భారతీయ నిబంధనలకు అనుగుణంగా డేటా స్థానికీకరణ (Data Localization), గోప్యత, భారతీయ ఆర్థిక చట్టాలకు లోబడి ఈ ఫ్రేమ్‌వర్క్ నిర్మించినట్లు కంపెనీ తెలిపింది. ‘మేము భారతదేశంలో దశాబ్దాలుగా సర్వీసులు అందిస్తున్నాం. ఇక్కడి డేటా నిబంధనల ఆధారంగానే మా ఏజెంటిక్ కామర్స్ ఏర్పాటు చేశాం’ అని రాజ్‌పుత్‌ స్పష్టం చేశారు.

సాధారణ ఈ-కామర్స్ Vs ఏజెంటిక్ కామర్స్

సాధారణ ఈ-కామర్స్‌లో మీరు ఒక వెబ్‌సైట్‌కి వెళ్లి వస్తువులను వెతికి, ధరలను పోల్చి, మీరే ఆర్డర్ చేస్తారు. ఇక్కడ ఏఐ కేవలం ‘మీకు ఫలానా వస్తువులు నచ్చవచ్చు’ అని సిఫార్సులు మాత్రమే చేస్తుంది.

ఏజెంటిక్ కామర్స్‌లో ఒక ఏఐ ఏజెంట్ ఉంటుంది. మీరు దానికి ఒక పని చెబితే (ఉదాహరణకు: వచ్చే వారం మా నాన్నగారి పుట్టినరోజు కోసం రూ.5000 బడ్జెట్‌లో ఒక మంచి వాచ్ కొనాలి), అది స్వయంగా ఇంటర్నెట్‌లో వెతుకుతుంది. రివ్యూలు చదువుతుంది. ఉత్తమమైన ధర ఎక్కడ ఉంటుందో తెలుసుకుంటుంది. చివరగా మీ అనుమతితో లావాదేవీని పూర్తి చేస్తుంది.

మోసాలకు తావులేని ఆటోమేషన్

ఏఐ ఏజెంట్లు స్వయంగా ఖర్చు చేస్తాయంటే భద్రతపై ఆందోళన కలగడం సహజం. దీన్ని అరికట్టడానికి మాస్టర్ కార్డ్ టోకెనైజేషన్, పాస్ కీ వంటి అధునాతన భద్రతా ప్రమాణాలను ప్రవేశపెట్టింది. ఏజెంట్ లావాదేవీ చేయాలంటే వినియోగదారుడి అనుమతి తప్పనిసరి. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడానికి కంపెనీ తన ప్లాట్‌ఫామ్‌ను మరింత బలోపేతం చేసింది. ఇది వినియోగదారుడి గత చరిత్రను విశ్లేషించి అసాధారణ మార్పులను వెంటనే గుర్తిస్తుంది. గ్రాఫ్ ఆధారిత సాంకేతికత ద్వారా సింథటిక్ ఐడెంటిటీలు, అంతర్జాతీయ మోసగాళ్ల నెట్‌వర్క్‌లను పసిగట్టడం మాస్టర్ కార్డ్ ప్రత్యేకతని కంపెనీ తెలిపింది.

ఉద్యోగాల కోత కాదు..

ఏజెంటిక్ ఏఐ రాకతో ఫిన్‌టెక్ రంగంలో ఉద్యోగాలపై ప్రభావం గురించి అడిగిన ప్రశ్నకు రాజ్‌పుత్‌ స్పందిస్తూ ‘కచ్చితంగా ఉద్యోగాల స్వరూపంలో మార్పు ఉంటుంది. అయితే ఉద్యోగాల కోత కంటే వివిధ జాబ్‌ రోల్స్‌పై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది’ అని విశ్లేషించారు. మెకానికల్ పనులను ఏఐ చూసుకుంటే మానవులు మరింత సృజనాత్మక, వ్యూహాత్మక పనుల వైపు మళ్లాలని సూచించారు.

ఇదీ చదవండి: రిటైర్మెంట్‌కు రెడీనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement