నాలుగు రెట్లు ఎగిసిన ఇండియా సిమెంట్స్‌ నికరలాభం | India Cements posted a standalone net profit of Rs 54. 75 crore in Q4 FY26 | Sakshi
Sakshi News home page

నాలుగు రెట్లు ఎగిసిన ఇండియా సిమెంట్స్‌ నికరలాభం

Apr 26 2026 3:47 AM | Updated on Apr 26 2026 3:47 AM

 India Cements posted a standalone net profit of Rs 54. 75 crore in Q4 FY26

విక్రయాల వాల్యూమ్‌లో గణనీయ వృద్ధి 

మెరుగైన రియలైజేషన్‌తో ఆదాయం పెరుగుదల 

రూ.2,000 కోట్ల క్యాపెక్స్‌తో విస్తరణకు ప్రణాళికలు

ముంబై: ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌ 2025–26 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో నికర లాభం నాలుగు రెట్లకు పైగా పెరిగి రూ.59.5 కోట్లకు చేరింది. అమ్మకాల పరిమాణం (వాల్యూమ్‌) పెరగడం, అలాగే అమ్మకాల ద్వారా లభించే ఆదాయం (సేల్స్‌ రియలైజేషన్‌) మెరుగుపడడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.14.67 కోట్లుగా నమోదైంది. మొత్తం వ్యయాలు 10.5% తగ్గి రూ.1,174.79 కోట్లకు దిగివచ్చాయి. సమీక్షించిన త్రైమాసికంలో దేశీయ అమ్మకాల పరిమాణం 3.12 మిలియన్‌ టన్నులుగా నమోదై, వార్షిక ప్రాతిపదికన 18% పెరుగుదల సాధించింది.

నికర రియలైజేషన్‌ (అమ్మకాల ద్వారా లభించే ఆదాయం) త్రైమాసిక ప్రాతిపదికన 3.5%, వార్షిక ప్రాతిపదికన 6.2 శాతం వృద్ధి కనబరిచింది. మొత్తం ఆదాయం 2.57% పెరిగి రూ.1,254.50 కోట్లకు చేరింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి గానూ నష్టాలు రూ.143.69 కోట్ల నుంచి రూ.67.25 కోట్లకు తగ్గాయి. మొత్తం ఆదాయం 5.33% పెరిగి రూ.4,572.35 కోట్లకు చేరాయి.

వచ్చే రెండేళ్లలో రూ.2,000 కోట్ల మూలధన వ్యయం (క్యాపెక్స్‌) ప్రణాళికను రూపొందించినట్లు తెలిపింది. ఈ నిధులను వృద్ధి అవకాశాలు, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం వినియోగించనున్నట్లు పేర్కొంది. దేశంలోని ప్రముఖ సిమెంట్‌ తయారీ సంస్థ ఆల్ట్రాటెక్‌ సిమెంట్, దక్షిణ భారతదేశానికి చెందిన ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌(ఐసీఎల్‌)లో ప్రమోటర్ల వాటాను కొనుగోలు చేసింది. దీంతో 2024 డిసెంబర్‌ 24 నుంచి ఐసీఎల్‌ అ్రల్టాటెక్‌ సిమెంట్‌కు అనుబంధ సంస్థగా మారింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement