
125 గిగావాట్లకు చేరిన సామర్థ్యం
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
సోలార్ విద్యుదుత్పత్తి పరంగా భారత్ ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంది. ఉత్పాదక సామర్థ్యం 125 గిగావాట్ల సామర్థ్యాన్ని అధిగమించినట్టు కేంద్ర పనరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అంతర్జాతీయ సోలార్ కూటమి (ఐఎస్‌ఏ) కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.
‘కాప్28 అంగీకారం మేరకు ప్రపంచ పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యం మూడు రెట్లు పెరిగి 2030 నాటికి 11,000 గిగావాట్లకు చేరుకోవాలి. ఈ లక్ష్య సాధనలో సోలార్ విద్యుత్ అన్నది కీలక పాత్ర పోషిస్తుంది. నేడు 125 గిగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద సోలార్ విద్యుదుత్పత్తిదారుగా ఉంది’ అని మంత్రి తెలిపారు.
దేశ ఆకాంక్ష క్షేత్రస్థాయిలో ఎంత ప్రభావం చూపించగలదన్నది దానికి ఈ పురోగతి నిదర్శనమని పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజ్లీ యోజన పథకం కింద ఇప్పటికే 20 లక్షలకు పైగా గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ వసతులు సమకూర్చినట్టు చెప్పారు. ఈ నెల 27 నుంచి 30 వరకు అంతర్జాతీయ సోలార్ కూటమి సదస్సు ఢిల్లీలో జరగనుంది. సోలార్ ఇంధన పరిష్కారాల ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా ఐఎస్‌ఏని ఏర్పాటు చేయడం గమనార్హం.
ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు..