పెట్రోల్‌ ధరలు తగ్గించండి - ఇక్రా

icra report said govt to cut fuel tax by rs 4.50 a litre reduce petrol and diesel price - Sakshi

దీనివల్ల  ప్రభుత్వ ఆదాయాలకు ఢోకా ఉండదు

ద్రవ్యోల్బణం సమస్యకూ ఉపశమనం

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ వినియోగంతో ప్రయోజనం

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా విశ్లేషణ  

ముంబై: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ వినియోగం.. ‘ప్రభుత్వ ఆదాయాలకు ఎటువంటి విఘాతం కలుగకుండా’ ఇంధన సెస్‌ తగ్గింపునకు దోహదపడుతుందని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా శుక్రవారం విశ్లేషించింది. 2020–21లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాల్లో ఎటువంటి ప్రభావం పడకుండా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.4.5 సెస్‌ భారం తగ్గించవచ్చని పేర్కొంది. అంతర్జాతీయంగా ఇంధన ధరల తీవ్రత దీనితో దేశంలో ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరల నేపథ్యంలో ఇక్రా తాజా సూచనలు చేసింది. దీనివల్ల ద్రవ్యోల్బణం ఆందోళనలను కూడా తగ్గించవచ్చని పేర్కొంది. ఇక్రా విశ్లేషణాంశాలను పరిశీలిస్తే..  మహమ్మారి వ్యాప్తికి ముందు 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021–22లో పెట్రోల్‌ వినియోగం 6.7 శాతం, డీజిల్‌ వినియోగం 3.3 శాతం పెరుగుతుందని అంచనా. కాగా, 2020–21లో పోల్చితే పెట్రోల్‌ వినియోగం 2021–22లో 14 శాతం పెరుగుతుందని అంచనా. డీజిల్‌ విషయంలో ఈ అంచనా 10 శాతంగా ఉంది. 


 
2020–21లో సెస్‌ ద్వారా రూ.3.2 లక్షల కోట్లు వసూలవుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనావేస్తోంది. అయితే అధిక వినియోగం వల్ల ఈ ఆదాయాలు 2021–22లో మరో రూ.40 వేల కోట్లు పెరిగి రూ.3.6 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. పెరుగుతున్న రవాణా, ఎకానమీ రికవరీ దీనికి కారణం. అంటే వినియోగం భారీ పెరుగుదల వల్ల సెస్‌ల రూపంలో 2021–22లో రూ.40,000 కోట్లు ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుందన్నమాట. ఈ అదనపు సెస్‌ రూ.40,000 కోట్ల వసూళ్లను ప్రభుత్వం వదులుకోడానికి సిద్ధపడితే, లీటర్‌ ఇంధనంపై రూ.4.5 మేర సెస్‌ భారం తగ్గుతుంది.
  
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ సెస్‌ ద్వారా వచ్చిన ఆదాయాలను చూస్తే, ఏప్రిల్, మే నెలల్లో రూ.80,000 కోట్లు ఒనగూరాయి. 2020–21 ఆదాయాలను చేరడానికి  మరో రూ.2.4 లక్షల కోట్లు వసూలయితే సరిపోతుంది.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న విధంగా 2 నుంచి 6 శాతం శ్రేణిలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికీ రూ.40,000 కోట్ల సెస్‌ తగ్గింపు  నిర్ణయం దోహదపడుతుంది.  సెస్‌ను లీటర్‌కు రూ.4.5 తగ్గిస్తే, ఇంధనం, లైట్, ఆహార  ద్రవ్యోల్బణం 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గే అవకాశం ఉంది. రెపో రేటు  (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2021–22లో 5.3 శాతం ఉండే వీలుంది.  ఆర్‌బీఐ అంచనా ప్రకారం ఇది 5.1 శాతంగా  ఉంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం మొదటి, రెండవ, మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వరుసగా 5.2 శాతం, 5.4 శాతం, 4.7 శాతం, 5.3 శాతంగా కొనసాగుతాయని ఆర్‌బీఐ ఇటీవలి ద్వైమాసిన సమీక్ష అంచనావేసింది.  

అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరల పెరుగుదలకు తోడు డాలర్‌ మారకంలో రూపాయి బలహీన ధోరణి, మార్చి 2020 నుంచీ కేంద్రం విధించిన అధిక సెస్‌లు, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు రెట్లకుపైగా పెంచిన వ్యాల్యూ యాడెడ్‌ పన్నులు (వీఏటీ)  పెట్రోల్, డీజిల్‌ రిటైల్‌ ధరలు భారీగా పెరుగుదలకు కారణమయ్యాయి.  దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రోల్‌ ధర లీటర్‌ రూ.100 దాటేసింది. డీజిల్‌ విషయంలోనూ ధర మూడంకెలకు చేరవయ్యింది. ఈ పరిస్థితుల్లో వినియోగదారుకు ప్రయోజనం చేకూర్చడానికి ఇంధనంపై విధించిన సెస్‌ను తగ్గించాలన్న డిమాండ్‌ విస్తృతమవుతోంది.  అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు భారీగా పడిపోయిన నేపథ్యంలో అదనపు ఆదాయానికి ఒక మార్గంగా 2020 ప్రారంభంలో సెస్‌ మార్గాన్ని కేంద్రం ఎంచుకుంది. ఇప్పుడు క్రూడ్‌ ధరలు భారీగా పెరిగాయి. అయినా ప్రభుత్వం సెస్‌ను కొనసాగిస్తోంది. ఇది వినియోగదారుపై తీవ్ర భారాన్ని మోపుతోంది.  

ద్రవ్యోల్బణం ఐదు శాతం: యూబీఎస్‌ అంచనా 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటున రిటైల్‌ ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉండే వీలుందని స్విస్‌ బ్రోకరేజ్‌ సంస్థ యూబీఎస్‌ అంచనావేసింది. అయితే రూపాయి మరింత బలహీనపడి, అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు పెరిగితే రిటైల్‌ ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చని కూడా తన తాజా నివేదికలో పేర్కొంది. ఇక్రా రేటింగ్స్‌ విషయంలో ఈ అంచనా 5.3 శాతంగా ఉండగా, ఆర్‌బీఐ అంచనా 5.1 శాతం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top