తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తాయ్‌మామన్ తంగ మోదిరం’ (మేనమామ బంగారు ఉంగరం) పథకానికి సంబంధించి నిర్వహించిన గ్లోబల్ టెండర్లలో ప్రముఖ ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ సంచలన బిడ్‌తో ఎల్1 స్థానాన్ని కైవసం చేసుకుంది. సుమారు రూ.755.83 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్‌లో ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారు ఉంగరానికి కేవలం ‘1 పైసా’ మాత్రమే సర్వీస్ / తయారీ రుసుము (మేకింగ్ ఛార్జీలు, ట్రాన్స్‌పోర్ట్, ఇన్సూరెన్స్, హాల్‌మార్కింగ్)గా ఖరారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ పోటీలో పాల్గొన్న 11 ప్రముఖ సంస్థల్లో జీఆర్‌టీ జ్యువెలర్స్ రూ.410.97 (L2), వుమ్మిడి బంగారు జ్యువెలర్స్ రూ.822.97 (L3) ప్రతిపాదించగా జోయాలుక్కాస్ కోట్ చేసిన వ్యయం ఎవరికీ ఊహకందని విధంగా నిలిచింది. తమిళనాడు టెండర్ల పారదర్శకత చట్టం ప్రకారం, తక్కువ ధరను మ్యాచ్ చేసేందుకు ఇతర కంపెనీలకు అవకాశం ఇవ్వగా ఒక్క కల్యాణ్ జ్యువెల్లర్స్ మాత్రమే ముందుకు వచ్చింది. దాంతో ఈ మొత్తం ఆర్డర్‌లో 70 శాతం కోటాను జోయాలుక్కాస్‌కు, మిగిలిన 30 శాతాన్ని కల్యాణ్ జ్యువెలర్స్‌కు కేటాయిస్తూ టీఎన్‌ఎంఎస్‌సీ ఉత్తర్వులు జారీ చేసింది.
తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే దాదాపు 4.41 లక్షల మంది నవజాత శిశువులకు ఒక్కో గ్రాము బంగారు ఉంగరాన్ని సెప్టెంబర్ 15 నుంచి పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం బంగారం అసలు ధరకు అయ్యే వ్యయాన్ని భరిస్తుండగా తయారీ, పంపిణీ బాధ్యతలను ఈ సంస్థలు నిర్వర్తిస్తాయి. వాణిజ్య లాభాల కంటే ప్రజారోగ్య సంక్షేమ పథకానికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతోనే రూపాయి రహిత లాభాల మార్జిన్‌తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోయాలుక్కాస్ అధినేత జోయ్ ఆలుక్కాస్ వెల్లడించారు.
మరోవైపు, ఒక పైసాకే ఎలా పనులు చేపడతారంటూ ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఈ ప్రక్రియపై సందేహాలు వ్యక్తం చేయగా, తమిళనాడు ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా అత్యంత నాణ్యమైన బీఐఎస్ హాల్‌మార్క్ బంగారాన్ని సేకరిస్తున్నామని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: అనలాగ్ పన్నీర్‌పై నిషేధం


