
దేశవ్యాప్తంగా ఏఐ ఆధారిత మోసాలను గుర్తించే వ్యవస్థను ప్రారంభించిన 37 రోజుల్లోనే ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లోని 6.1 మిలియన్ల మంది వినియోగదారులను ఆన్‌లైన్ మోసగాళ్ల బారిన పడకుండా కాపాడినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించే చర్యల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు చెప్పింది.
వినియోగదారులకు సైబర్ దాడుల నుంచి రక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్‌ను ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని యోచించింది. అందులో భాగంగా ఎయిర్‌టెల్ ఈ విధానాన్ని ప్రారంభించిన 37 రోజుల్లోనే రెండు రాష్ట్రాల్లో 6.1 మిలియన్లకు పైగా వినియోగదారులను విజయవంతంగా రక్షించిందని ఒక ప్రకటనలో తెలిపింది. అధునాతన వ్యవస్థ ఎస్ఎంఎస్‌లు, సోషల్ మీడియా ఖాతాలు, ఈ-మెయిల్స్, ఇతర బ్రౌజర్లలోని లింక్‌లను స్కాన్ చేసి ఫిల్టర్ చేస్తుందని తెలిపింది.
ఇది ప్రతిరోజూ ఒక బిలియన్ యూఆర్ఎల్స్‌ను (యూనిఫాం రిసోర్స్ లొకేటర్లు) పరిశీలించడానికి రియల్ టైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. హానికరమైన సైట్ల నుంచి జరిగే ప్రమాదాన్ని గుర్తించి 100 మిల్లీ సెకన్లలో రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: నాన్న చెప్పిన ఒక్క మాటతో రూ.1,200 కోట్లు సంపాదన
ఉదాహరణకు, ఒక వినియోగదారుకు ‘మీ ప్యాకేజీ ఆలస్యం అయింది. ట్రాక్ చేయాలంటే వెంటనే క్లిక్ చేయండి’ అంటూ ఓ మేసేజ్ వచ్చిందనుకుందాం. ఆ లింక్‌పై యూజర్ క్లిక్ చేస్తే ఎయిర్‌టెల్ సిస్టమ్ వెంటనే లింక్‌ను స్కాన్ చేస్తుంది. అనుమానాస్పదంగా ఉంటే యాక్సెస్‌ను బ్లాక్ చేస్తుంది. దాంతోపాటు యూజర్‌కు హెచ్చరిక సందేశం పంపుతుంది. ‘బ్లాక్ చేయబడింది! ఎయిర్‌టెల్ ఈ సైట్‌ను ప్రమాదకరంగా గుర్తించింది!’ అని పాప్‌అప్ మెసేజ్ వస్తుంది.