పెద్ద పట్టణాల్లో ఇళ్ల అమ్మకాల జోరు

Housing Sales In Volume Terms Grew 11percent Across 7 Cities In India - Sakshi

డిసెంబర్‌ క్వార్టర్‌లో 11 శాతం వృద్ధి

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా నివేదిక

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో 11 శాతం పెరిగినట్టు రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఏడు పట్టణాల్లో 149 మిలియన్‌ చదరపు అడుగులు (ఎంఎస్‌ఎఫ్‌) అమ్ముడుపోయినట్టు వెల్లడించింది. గత పదేళ్లలో ఒక త్రైమాసికం వారీ అత్యధిక విక్రయాలు ఇవేనని పేర్కొంది. డిమాండ్‌ మెరుగ్గా ఉండడమే వృద్ధికి మద్దతునిచ్చినట్టు తెలిపింది.

2022–23 మొదటి తొమ్మిది నెలల్లో (2022 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు) ఈ ఏడు ప్రధాన పట్టణాల్లో 412 ఎంఎస్‌ఎఫ్‌ అడుగుల ఇళ్లను విక్రయించినట్టు ఇక్రా తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే తొమ్మిది నెలల్లో విక్రయాలు 307 ఎంఎస్‌ఎఫ్‌తో పోలిస్తే 30 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. కరోనా మహమ్మారి తర్వాత కొనుగోలుదారుల ప్రాధాన్యతల్లో మార్పు వచ్చిందంటూ.. లగ్జరీ, మధ్య స్థాయి ధరల ఇళ్ల వాటా పెరిగినట్టు వివరించింది.

2019–20లో లగ్జరీ ఇళ్ల వాటా 14 శాతం, మధ్యస్థాయి ధరల ఇళ్ల వాటా 36 శాతం చొప్పున ఉంటే.. 2022–23 ఏప్రిల్‌–డిసెంబర్‌ కాలానికి లగ్జరీ ఇళ్ల అమ్మకాల వాటా 16 శాతానికి పెరిగితే, మధ్యస్థాయి ఇళ్ల విక్రయాల వాటా 42 శాతానికి చేరింది. హైదరాబాద్‌తోపాటు, చెన్నై బెంగళూరు, కోల్‌కతా, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్, నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్, పుణె పట్టణాలకు సంబంధించి ఇక్రా గణాంకాలు విడుదల చేసింది.

2023–24లో 16 శాతం..  
‘‘రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ అమ్మకాలు విలువ పరంగా 2022–23లో 8–12 శాతం మేర వృద్ధి చెందొచ్చు. 2023–24లో 14–16 శాతం మధ్య పెరగొచ్చు’’అని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్, కో గ్రూప్‌ హెడ్‌ అనుపమ రెడ్డి తెలిపారు. టాప్‌–12 డెవలపర్ల ప్రాథమిక గణాంకాల ఆధారంగా వేసిన అంచనాలుగా ఇక్రా పేర్కొంది. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెరుగుదల గృహ కొనుగోళ్లపై లేదని తెలిపింది. ‘‘కరోనా ముందున్న నాటి రేట్ల కంటే ఇప్పటికీ గృహ రుణాలపై రేట్లు తక్కువే ఉన్నాయి.

కనుక కొనుగోలు శక్తి ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. తక్కువ నిల్వలు, డెవలపర్లు తమకు అనుకూలంగా ప్రాజెక్టులు ప్రారంభించడం, ఉద్యోగ మార్కెట్‌లో మందగమనం, వడ్డీ రేట్లు మరింత పెరుగుదల కొనుగోలు శక్తిపై చూపించే అంశాలు’’అని పేర్కొంది. 2022 డిసెంబర్‌ నాటికి అమ్ముడుపోని ఇళ్ల పరిమాణం 839 ఎంఎస్‌ఎఫ్‌గా ఉందని ఇక్రా తెలిపింది. 2021 డిసెంబర్‌లో విక్రయం కాని ఇళ్లు 923 ఎంఎస్‌ఎఫ్‌తో పోలిస్తే తక్కువేనని గుర్తు చేసింది. వార్షికంగా చూస్తే 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 10 శాతం పెరిగినట్టు పేర్కొంది. పెరిగిన నిర్మాణ వ్యయాలను కస్టమర్లకు బదిలీ చేయడమే ధరల పెరుగుదలకు కారణంగా తెలిపింది. 

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top