
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటివరకు ఫ్లాట్‌ను విక్రయించాలంటే క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్ వంటి ఆధునిక సదుపాయాలిస్తే చాలనుకునే వారు బిల్డర్లు. కానీ, ఇప్పుడలా కుదరదు. ఎందుకంటే కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులొచ్చాయి. తమ పిల్లలు చదువుకునేందుకు పాఠశాల, ఆధునిక ఆస్పత్రి వంటివి కూడా ఉంటేనే ఫ్లాట్ కొంటామంటున్నారు. అవి కూడా ప్రాజెక్ట్ దగ్గర్లో కాదు ఏకంగా ప్రాజెక్ట్ ఆవరణలోనే ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో బిల్డర్లు బడిబాట పడుతున్నారు. ప్రాజెక్ట్‌ల్లో ఫ్లాట్లే కాదు పాఠశాల, ఆస్పత్రి వంటివి కూడా నిర్మిస్తున్నారు. నగరంలో ఈ తరహా నిర్మాణాలు క్రమంగా పెరుగుతున్నాయి.
సొంతింటి ఎంపికలో విద్యాలయాలు, ఆస్పత్రులు కీలకంగా మారుతున్నాయి. అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆస్పత్రికి వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, వర్షం కురుస్తున్నప్పుడు ఇంటి నుంచి కిలోమీటర్ల దూరముండే స్కూల్‌కు తమ పిల్లలు పంపించడం తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అందుకే ఫ్లాట్‌ను కొనుగోలు చేసేముందు పిల్లల అవసరాలు, ఆరోగ్యాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. మరీ ఎక్కువగా వర్షాకాలంలో బస్సుల కోసం వేచి చూడటం తల్లిదండ్రులకు చిరాకు కలిగిస్తోంది. పిల్లలు వర్షంలో తడవకుండా ఇంటి నుంచే నేరుగా పాఠశాలకు వెళ్లగలరా? హఠాత్తుగా అనారోగ్యం తలెత్తితే వెంటనే ఆస్పత్రికి వెళ్లేందుకు వీలుగా ప్రాజెక్ట్‌లోనే ఆస్పత్రి ఉందా? వంటి అంశాలను తెలుసుకుంటున్నారు. అందుకే ఫ్లాట్‌ను కొనేముందు క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలే కాదు ప్రాజెక్ట్ ఆవరణలోనే పాఠశాల, ఆస్పత్రి వంటివి ఉంటేనే ఫ్లాట్ కొనేందుకు ముందుకొస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
శరవేగంగా అభివృద్ధి..
కొనుగోలుదారుల అభిరుచిలో వచ్చిన మార్పుతో ఆయా ప్రాజెక్ట్‌లు ఉండే ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఎలాగంటే కొనుగోలుదారుల కోసం, తమ వ్యాపారం కోసం తమ ప్రాజెక్ట్ ఆవరణలో పాఠశాలలు, ఆస్పత్రులు నెలకొల్పేందుకు బిల్డర్లు ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటారు. కొన్ని కంపెనీలైతే ప్లే స్కూళ్లు, రీసెర్చ్ సెంటర్లకూ ప్రాజెక్టుల్లోనే స్థానం కల్పిస్తాయి. దీంతో ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం విద్యాలయాలు, ఆస్పత్రులతో కళకళలాడతాయి. దీంతో దేశ, విదేశీ కంపెనీలు ఆయా ప్రాంతాల్లో షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్‌ల వంటివి ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తాయి. దీంతో ఆయా ప్రాంతాలు రియల్ బూమ్‌తో శరవేగంగా అభివృద్ధి చెందుతాయి.