హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాజీ ఎండీ ఆదిత్య పూరి కుటుంబ సభ్యులు ముంబైలోని తమ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను భారీ ధరకు విక్రయించారు. ఆదిత్య పూరి భార్య అనితా పూరి, కుమార్తె అమృతా పూరి కలిసి వర్లీ ప్రాంతంలోని తమ నివాసాన్ని రూ. 27 కోట్లకు అమ్మేసినట్లు రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా వెల్లడైంది. ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ బ్యాంకర్ ఆదిత్య పూరి కుటుంబం చేసిన భారీ ఆస్తి విక్రయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
లాభదాయకమైన విక్రయం
ఈ అపార్ట్‌మెంట్‌ను అనితా పూరి కుటుంబం మార్చి 2017లో రూ. 19.81 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా జరిగిన విక్రయం ద్వారా వారికి దాదాపు రూ. 7 కోట్లకు పైగా లాభం చేకూరింది. ముంబైలోని అత్యంత విలాసవంతమైన 'ఓంకార్ 1973' భవనంలోని ఎత్తైన అంతస్తులో ఈ ఫ్లాట్ ఉంది. దీనిని సురేమ్య నెవాటియా, అక్షడా నెవాటియాలు కొనుగోలు చేశారు.

మార్చి 24, 2026న ఈ లావాదేవీ అధికారికంగా నమోదైంది. ఈ డీల్ కోసం కొనుగోలుదారులు రూ. 1.62 కోట్ల స్టాంప్ డ్యూటీని, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించారు. ఈ అపార్ట్‌మెంట్‌తో పాటు నాలుగు కార్ పార్కింగ్ స్థలాలు కూడా కొనుగోలుదారులు పొందారు.అయితే, ఈ విక్రయంపై పూరి కుటుంబం గానీ, కొనుగోలుదారులు గానీ ఇంతవరకు స్పందించలేదు.
ఓంకార్ 1973 ప్రత్యేకత
ముంబైలోని వర్లీలో ఉన్న 'ఓంకార్ 1973' ఒక ఐకానిక్ ఆకాశహర్మ్యం. ఓంకార్ రియల్టర్స్ అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్, అరేబియా సముద్రం వ్యూ, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అల్ట్రా-ప్రీమియం జీవనశైలిని అందిస్తుంది. నగరంలోని అత్యంత ఖరీదైన చిరునామాలలో ఇది ఒకటి.
అనితా పూరి, అమృతా పూరి గతంలో కూడా రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టారు. నవంబర్ 2020లో వారు ముంబైలోని మలబార్ హిల్స్‌లో రూ. 50 కోట్ల విలువైన మరో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. లోధా సీమాంట్ ప్రాజెక్టులోని 19వ అంతస్తులో ఉన్న ఆ ఫ్లాట్‌కు ఏడు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. అప్పట్లో ఆ లావాదేవీకి రూ. 1 కోటి స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు వార్తాలు వచ్చాయి.
ఇదీ చదవండి: బెంగళూరులో ఇంటి ఓనర్స్ అయిపోయాం..


