బెంగళూరులో ఇంటి ఓనర్స్‌ అయిపోయాం.. | From Struggle To Success, Bengaluru Couple First Home Buying Journey Video Wins Hearts In Online | Sakshi
Sakshi News home page

బెంగళూరులో ఇంటి ఓనర్స్‌ అయిపోయాం..

Apr 25 2026 7:58 PM | Updated on Apr 25 2026 8:11 PM

bangalore-couple-first-home-buying-journey-viral-story

సొంత ఇల్లు.. సగటు మధ్యతరగతి మనిషి జీవితకాల కల. అదీ ముంబై తర్వాత అత్యంత ఖరీదైన రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌గా (Real Estate Market) చెప్పే బెంగళూరు నగరంలో. ఆ సొంతింటి కలని నిజం చేసుకోవడం వెనుక ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయో, ఎన్ని ఆర్థిక సవాళ్లు ఉంటాయో వివరిస్తూ బెంగళూరుకు చెందిన ఓ జంట పంచుకున్న కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

అడుగు ముందుకు వేయడమే అతిపెద్ద సాహసం!

సుమారు 18 నెలల క్రితం జెనిత్ రాయ్ చక్రవర్తి, ఆమె భర్త బెంగళూరులోని ఒక ప్రైమ్‌ లొకేషన్‌లో ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆ సమయంలో వారి ఆర్థిక పరిస్థితికి అది కొంత భారము అయినా, ఆ రిస్క్ తీసుకోవడానికే వారు సిద్ధపడ్డారు. రియల్ ఎస్టేట్ రంగంపై కనీస అవగాహన గానీ, సరైన మార్గదర్శకులు గానీ లేకపోయినా.. ధైర్యమే పెట్టుబడిగా ముందుకెళ్లారు.

నిద్రలేని రాత్రులు.. ఎన్నో సందేహాలు

ఈ ప్రయాణం పూల బాట ఏమీ కాదని జెనిత్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. వారు ఎదుర్కొన్న సవాళ్లు ఇవే.. ఇల్లు ఇంకా నిర్మాణంలో ఉంది, ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. గృహ రుణాలు (Home Loans), ప్రాపర్టీ మార్కెట్ నిబంధనలు అర్థం చేసుకోవడానికి సొంతంగా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ‘మేము సరైన నిర్ణయమే తీసుకున్నామా?’ అనే భయం, నిద్రలేని రాత్రులు వారిని వెన్నెంటే ఉన్నాయి.

‘మేము దాదాపు శూన్యం నుంచి మొదలుపెట్టాం. ప్రతి అడుగులోనూ భయం ఉన్నా, ఒకరికొకరం అండగా నిలబడ్డాం. మా కుటుంబ సభ్యుల మద్దతు మమ్మల్ని ముందుకు నడిపించింది’ అని జెనిత్ భావోద్వేగానికి గురయ్యారు.

 

నిర్మాణంతో పాటే.. ఆత్మవిశ్వాసం కూడా!
వందల సార్లు సైట్ విజిట్లు చేయడం, డాక్యుమెంట్లు సరిచూసుకోవడం, బ్యాంకుల చుట్టూ తిరగడం.. ఇలా ప్రతి దశలోనూ వారు కొత్త విషయాలు నేర్చుకున్నారు. ఇల్లు రూపుదిద్దుకుంటున్న కొద్దీ, వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. చివరకు ఆ ఇల్లు పూర్తి కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

 

ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు..
‘ఇది ఇతరులకు కేవలం ఒక ఆస్తిలా కనిపించవచ్చు. కానీ మాకు మాత్రం ఇది మా కష్టానికి, పట్టుదలకు నిదర్శనం’ అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ జంట వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎవరైనా కష్టపడితే, సరైన ప్రణాళికతో ముందడుగు వేస్తే తమ కలను ఎలా నిజం చేసుకోవచ్చో చెప్పడానికి ఈ జంట ప్రయాణమే ఒక నిదర్శనం.

ఇదీ చదవండి: EMI మిస్ అయింది.. ఇంటిని సీల్ చేస్తారా?

Advertisement
 
Advertisement
Advertisement