
క్యూ1లో రూ. 3,843 కోట్లు
షేరుకి రూ. 12 డివిడెండ్
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 10 శాతం క్షీణించి రూ. 3,843 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 4,257 కోట్లు ఆర్జించింది. అధిక వ్యయాలు, క్లయింట్ దివాలా లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 30,349 కోట్లను తాకింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు రికార్డ్ డేట్ జూలై 18కాగా.. 28కల్లా చెల్లించనుంది. ఈ కాలంలో 1,984 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించింది. అయితే త్రైమాసికవారీగా మొత్తం ఉద్యోగుల సంఖ్య 269 తగ్గి 2,23,151కు చేరింది.
3–5 శాతం వృద్ధి
పూర్తి ఏడాదికి ఆదాయంలో 3–5 శాతం వృద్ధి సాధించగలమని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా అంచనా(గైడెన్స్) ప్రకటించింది. ఉద్యోగులు, ఇతర అంశాలలో పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ సి.విజయకుమార్ పేర్కొన్నారు. ఏఐ విభాగంలో మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణకు తెరతీసినట్లు తెలియజేశారు. గైడెన్స్‌ను సాధించే బాటలో భారత్‌కు వెలుపలగల ప్రాంతాలలో కేంద్రాలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం, ఉద్యోగులను తగ్గించుకోవడం చేపట్టనున్నట్లు వివరించారు. తద్వారా మార్జిన్లను 18–19 శాతానికి పెంచుకోనున్నట్లు తెలియజేశారు. క్యూ1లో నిర్వహణ లాభ మార్జిన్లు 16.3 శాతానికి పరిమితమైనట్లు వెల్లడించారు. యుటిలైజేషన్ తగ్గడం, జెన్‌ఏఐ, జీటీఎం పెట్టుబడులు ప్రభావం చూపినట్లు తెలియజేశారు.
ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు బీఎస్‌ఈలో 1 శాతం నష్టంతో రూ. 1,620 వద్ద ముగిసింది.