
వ్యాపార నిర్వహణ సులభతరమవుతుంది
ఆర్‌బీఐ బులెటిన్ అభిప్రాయం
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థపై జీఎస్‌టీ తాజా సంస్కరణలు సానుకూల ప్రభావం చూపిస్తాయని ఆర్‌బీఐ బులెటిన్ అభిప్రాయపడింది. వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుందని, రిటైల్ ధరలు దిగొస్తాయని, వినియోగం బలపడుతుందని పేర్కొంది. అమెరికా విధించిన ప్రతీకార సుంకాలతో అనిశ్చితులు ఏర్పడినట్టు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్‌లో (క్యూ1) జీడీపీ వృద్ధి ఐదు త్రైమాసికాల గరిష్ట స్థాయికి చేరి తన బలాన్ని చాటినట్టు పేర్కొంది.
రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో స్వల్పంగా పెరిగినప్పటికీ ఆర్‌బీఐ లక్ష్యానికంటే ఎంతో దిగువనే ఉన్నట్టు గుర్తు చేసింది. వ్యవస్థలో లిక్విడిటీ (నగదు లభ్యత) మిగులు ఉన్నట్టు తెలిపింది. క్యూ1లో కరెంట్ ఖాతా లోటు గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే మోస్తరు స్థాయికి చేరినట్టు, సేవల ఎగుమతులు బలంగా ఉండడం, రెమిటెన్స్‌లు (విదేశాల నుంచి నగదు బదిలీలు) ఇందుకు సాయపడినట్టు బులెటిన్‌లో పేర్కొంది.
జీఎస్‌టీ తాజా సంస్కరణలు చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు, జీఎస్‌టీలపై నిబంధనల అమలు భారాన్ని తగ్గిస్తుందని, పన్ను నిబంధనల అమలును పెంచుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌ల నుంచి 45 శాతం ఎగుమతులకు మినహాయింపు కల్పించడాన్ని ప్రస్తావించింది. సుంకాల ప్రభావం రంగాలవారీగా ఉండొచ్చని పేర్కొంది. వాణిజ్య అనిశ్చితులు నెలకొన్నప్పటికీ ఎగుమతులు బలంగా ఉండడాన్ని గుర్తు చేసింది. తయారీ, సేవల రంగాల పనితీరు దశాబ్ద గరిష్టానికి చేరినట్టు తెలిపింది.