అంతంత మాత్రంగానే ఎఫ్‌ఎంసీజీ వృద్ధి.. క్యూ3లో 4–5 శాతంగా అంచనా | Sakshi
Sakshi News home page

అంతంత మాత్రంగానే ఎఫ్‌ఎంసీజీ వృద్ధి.. క్యూ3లో 4–5 శాతంగా అంచనా

Published Tue, Jan 9 2024 8:10 AM

Growth of Fmcg is Marginal Expectations - Sakshi

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు అక్టోబర్‌ - డిసెంబర్‌ త్రైమాసికంలో అమ్మకాల పరంగా తక్కువ నుంచి మధ్యస్థ సింగిల్‌ డిజిట్‌ వృద్ధిని చూడొచ్చని అంచనా వేస్తున్నాయి. సీక్వెన్షియల్‌గా (క్రితం త్రైమాసికం) వినియోగ డిమాండ్‌ ఊపందుకోవడమే ఈ అంచనాలకు కారణం. ఇప్పటికీ గ్రామీణ మార్కెట్లలో డిమాండ్‌ స్తబ్దుగానే ఉంది. పట్టణ ప్రాంతాల్లో వరుసగా మూడో త్రైమాసికంలోనూ డిమాండ్‌ నిలకడగా కొనసాగింది. ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు డాబర్, మారికో, గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ డిసెంబర్‌ త్రైమాసికం అప్‌డేట్‌లను పరిశీలించినప్పుడు ఈ విషయాలు తెలిశాయి. వినియోగం పుంజుకుంటుందనడానికి ఆరంభ సంకేతాలు కనిపిస్తున్నాయని, కనుక క్రమంగా వినియోగం పెరుగుతుందని ఎఫ్‌ఎంసీజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 

ద్రవ్యోల్బణం తగ్గడంతో, తయారీ వ్యయాలు దిగిరావడం వల్ల స్థూల మార్జిన్లు మెరుగుపడతాయని పేర్కొన్నాయి. దీంతో కంపెనీలు మరిన్ని ప్రకటనల ద్వారా అమ్మకాలు పెంచుకునేందుకు అనుకూల వాతావరణం నెలకొంది. ‘‘ప్రకటనలు, ప్రచారంపై వ్యయాలు పెంచడం ద్వారా అధిక శాతం స్థూల మార్జిన్ల విస్తరణకు అవకాశం ఉంది. నిర్వహణ లాభం ఆదాయం కంటే ఎక్కువ వృద్ధిని వార్షికంగా నమోదు చేయవచ్చు’’అని డాబర్‌ ఇండియా త్రైమాసికం వారీ అప్‌డేట్‌లో పేర్కొంది. 

త్రైమాసికం వారీగా చూస్తే డిమాండ్‌ ధోరణిలో పురోగతి కనిపించినట్టు చెప్పింది. అయినప్పటికీ పట్టణాల్లో వృద్ధితో పోలిస్తే గ్రామీణ వృద్ధి బలహీనంగానే ఉందని, కాకపోతే పుంజుకుంటున్న సంకేతాలు కనిపించాయని వెల్లడించింది. ధరల్లో వృద్ధి స్తబ్దుగానే ఉందని,  డిసెంబర్‌ త్రైమాసికంలో ప్రధానంగా అమ్మకాల పరిమాణంలోనే వృద్ధి కనిపించినట్టు తెలిపింది. ఎఫ్‌అండ్‌బీ విభాగం అమ్మకాలు అధిక సింగిల్‌ డిజిట్‌ వృద్ధిని చూడగా, హోమ్, పర్సనల్‌ కేర్‌ విభాగం అమ్మకాలు మధ్యస్థ సింగిల్‌ డిజిట్‌ను చూసినట్టు పేర్కొంది. ఎఫ్‌ఎంసీజీ కంపెనీల అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 35 శాతంగా ఉంటోంది.

గ్రామీణం పర్వాలేదు..
డిసెంబర్‌ క్వార్టర్‌లో గ్రామీణ మార్కెట్‌ కొంత ఉత్సాహపూరితంగా ఉన్నట్టు మారికో తెలిపింది. స్థూల ఆర్థిక అంశాలు మెరుగుపడడంతో 2024లో వినియోగం ఇంకా పుంజుకుంటుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. దేశీయ అమ్మకాల పరిమాణం తక్కువ స్థాయి సింగిల్‌ డిజిట్‌ వృద్ధికి పరిమితం కావొచ్చని, ప్రధాన పోర్ట్‌ఫోలియో అమ్మకాలు త్రైమాసికం వారీగా కొంత మెరుగుపడతాయని మారికో వివరించింది. పారాచ్యూట్‌ కోకోనట్‌ అయిల్‌ అమ్మకాలు తక్కువ సింగిల్‌ డిజిట్‌లో పెరగ్గా, సఫోలా ఆయిల్‌ అమ్మకాలు బలహీనంగా ఉన్నట్టు తెలిపింది. 

కన్సాలిడేటెడ్‌గా డిసెంబర్‌ త్రైమాసికం అమ్మకాల్లో మధ్యస్థ సింగిల్‌ డిజిట్‌ వృద్ధిని చూసినట్టు గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. ‘‘దేశీయంగా నిర్వహణ వాతావరణం సెప్టెంబర్‌ త్రైమాసికం మాదిరే ఉంది. అయినప్పటికీ మెరుగైన అమ్మకాలతో మధ్యస్థ సింగిల్‌ డిజిట్‌ వృద్ధి నమోదైంది’’అని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ దేశీయ ఎఫ్‌ఎంసీజీ అమ్మకాల వృద్ధి మధ్యస్థ సింగిల్‌ డిజిట్‌లోనే ఉండొచ్చని అంచనా. మారికో ఇంటర్నేషనల్‌ వ్యాపారం మధ్యస్థ స్థాయిలో వృద్ధి చెందగా, తమ అంతర్జాతీయ వ్యాపారం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుందని డాబర్‌ ఇండియా తెలిపింది.

Advertisement
 
Advertisement