పెయింట్ల బిజినెస్‌కు గ్రాసిమ్‌ సై | Grasim eyes number two position in decorative paints | Sakshi
Sakshi News home page

పెయింట్ల బిజినెస్‌కు గ్రాసిమ్‌ సై

Published Sat, Aug 26 2023 5:03 AM | Last Updated on Sat, Aug 26 2023 5:03 AM

Grasim eyes number two position in decorative paints - Sakshi

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌ దిగ్గజం గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ పెయింట్ల బిజినెస్‌పై దృష్టి పెట్టింది. ప్రధానంగా డెకొరేటివ్‌ విభాగంలో పట్టు సాధించాలని యోచిస్తోంది. అత్యధిక వృద్ధికి వీలున్న ఈ విభాగంలో దేశంలోనే నంబర్‌ టూ కంపెనీగా ఆవిర్భవించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణరంగ మెటీరియల్స్‌ సరఫరాకు కొత్తగా ప్రవేశించిన బీటూబీ ఈకామర్స్‌ బిజినెస్‌కు జతగా పెయింట్ల బిజినెస్‌ను పెంచుకోవాలని ప్రణాళికలు వేసింది. పరివర్తన దశ వృద్ధిలో భాగంగా రెండు కొత్త బిజినెస్‌లవైపు దృష్టి సారించినట్లు కంపెనీ వార్షిక సమావేశంలో చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా పేర్కొన్నారు.  

దిగ్గజాలతో పోటీ
గతేడాది పెయింట్ల బిజినెస్‌పై పెట్టుబడి ప్రణాళికలను సవరిస్తూ గ్రాసిమ్‌ రెట్టింపునకు పెంచింది. వెరసి రూ. 10,000 కోట్లను పెయింట్ల బిజినెస్‌పై వెచ్చించేందుకు సిద్ధపడుతోంది. తద్వారా మార్కెట్లో ఇప్పటికే విస్తరించిన పెయింట్స్‌ తయారీ దిగ్గజాలు ఏషియన్, బెర్జర్, కన్సాయ్‌ నెరోలాక్, ఆక్జో నోబెల్‌ ఇండియా తదితరాలతో పోటీకి తెరతీయనుంది. ప్రణాళికలకు అనుగుణంగా ఆరు సైట్లలోనూ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నట్లు బిర్లా పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) నాలుగో త్రైమాసికానికల్లా ప్లాంట్లు ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు.

పరిశోధన, అభివృద్ధి యూనిట్‌ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్లు తెలియజేశారు. డెకొరేటివ్‌ పెయింట్ల విభాగంలో నంబర్‌ టూ కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యంతో ఉన్నట్లు వాటాదారులకు బిర్లా తెలియజేశారు. గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 4,307 కోట్లు వెచి్చంచగా.. వీటిలో రూ. 1,979 కోట్లు పెయింట్ల బిజినెస్‌కు కేటాయించినట్లు వివరించారు. దేశీ పెయింట్ల బిజినెస్‌ ప్రస్తుత రూ. 62,000 కోట్ల స్థాయి నుంచి రానున్న ఐదేళ్లలో రూ. లక్ష కోట్లకు చేరనున్నట్లు కొన్ని నివేదికలు అంచనా వేశాయి. ఇటీవల గ్రాసిమ్‌తోపాటు.. జేఎస్‌డబ్ల్యూ, పిడిలైట్‌ సైతం పెయింట్ల బిజినెస్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
వారాంతాన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ షేరు బీఎస్‌ఈలో స్వల్ప నష్టంతో రూ. 1,775 వద్ద ముగిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement