
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)కు డిప్యూటీ ఎండీగా వ్యవహరిస్తున్న భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. తాను హార్వర్డ్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రాఫెసర్‌గా తిరిగి వెళ్లనున్నట్టు ఆమె ప్రకటించారు. సెప్టెంబర్ 1న కొత్త బాధ్యతలను ఆమె స్వీకరించనున్నారు. ‘ఐఎంఎఫ్‌లో ఏడేళ్ల అద్భుత కాలం తర్వాత బోధనా వృత్తిలోకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాను’అని ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఐఎంఎఫ్ చరిత్రలో మొదటి మహిళా ముఖ్య ఆర్థికవేత్తగానే కాదు, మొదటి డిప్యూటీ ఎండీగా గోపీనాథ్ పనిచేసి చరిత్ర సృష్టించడం గమనార్హం. ఐఎంఎఫ్‌లో సేవల పట్ల గీతా గోపీనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. అసాధారణ సవాళ్లతో కూడిన సమయంలో పనిచేయాల్సి రావడం జీవితంలో ఒక్కసారి దక్కే అవకాశంగా పేర్కొన్నారు. ‘అధ్యాపక మూలాలాల్లోకి తిరిగి వెళుతున్నాను. అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారంగా పరిశోధనలపై దృష్టి సారించాలని అనుకుంటున్నాను. తదుపరి తరం ఆర్థికవేత్తలకు శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాను’అని గోపీనాథ్ తన భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.
ఇదీ చదవండి: రూ.కోటిలోపు ఫ్లాట్ల అమ్మకాలు డీలా
గోపీనాథ్ 2019లో ఐఎంఎఫ్‌లో ముఖ్య ఆర్థికవేత్తగా చేరారు. 2022 జనవరిలో ఐఎంఎఫ్ డిప్యూటీ డైరెక్టర్ పదవి సృష్టించి ఆ బాధ్యతలను ఆమెకు అప్పగించారు. ఐఎంఎఫ్‌కు ముందు హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టడీస్, ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేయడం గమనార్హం. గోపీనాథ్ అద్భుతమైన, అసాధారణ నేత అంటూ ఆమె సేవలను ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జీవా కొనియాడారు.