దావోస్ వేదికగా ఐఎంఎఫ్ ఎండీ గీతా గోపీనాథ్ ప్రశంసలు
అన్ని రాష్ట్రాలూ ఈ దిశగా మరింత దృష్టి సారించాలని సూచన
భారత్‌లో భూసేకరణ, సమస్యలు గందరగోళం.. ఇది వృద్ధికి, తయారీ రంగానికి ఒక పెద్ద సవాలు
అయితే కొన్ని రాష్ట్రాలు కొత్త పద్ధతులతో ప్రయోగాలు
ఏపీలో సృజనాత్మక రీతిలో భూ వినియోగం, భూ సంస్కరణలు
ఈ దిశగా ల్యాండ్ టైట్లింగ్ అంశంపై గట్టిగా ముందుకు వెళ్లడం ముఖ్యమని స్పష్టీకరణ
సీఎం చంద్రబాబు సమక్షంలోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు
తద్వారా ఎన్నికలకు ముందు బాబు, ఎల్లో మీడియా చేసిందంతా దు్రష్పచారమేనని తేటతెల్లం
జగన్‌పై కక్షతో దాన్ని ఏకపక్షంగా రద్దు చేసిన బాబు సర్కారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణలకు దావోస్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న సమావేశంలోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. తద్వారా ఎన్నికలకు ముందు ఎల్లో మీడియా చేసిందంతా దుష్ప్రచారమేనని తేటతెల్లమైంది. జగన్‌పై కక్షతో చంద్రబాబు విపరీతంగా దుష్ప్రచారం చేసి, అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేయడం తెలిసిందే. అయితే ల్యాండ్ టైట్లింగ్ అన్నది ఆదర్శనీయమని..దీనిపై అన్ని రాష్ట్రాలు దృష్టి సారించాలని ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) ఎండీ గీతా గోపీనాథ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఇటీవల జరిగిన దావోస్ సదస్సులో భారత ఆర్థిక వ్యవస్థపై ఆమె కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర ప్రముఖులతో కలిసి ఒక చర్చాగోష్టిలో మాట్లాడారు. ‘భారతదేశంలో చాలా సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో ఉన్న ఆర్థిక స్థిరత్వం చాలా ముఖ్యమైంది. కేవలం వృద్ధి రేటు మాత్రమే కాకుండా, ద్రవ్యోల్బణం కూడా తక్కువగా సింగిల్ డిజిట్‌లోనే ఉండటం భారత్‌కు కలిసి వచ్చే అంశం’ అని గీతా గోపీనాథ్ అన్నారు.
అయితే భూసేకరణ, డీ రెగ్యులేషన్ వెనక్కు నెడుతున్నాయని ఆమె గతంలో చెప్పిన విషయాలను వ్యాఖ్యాత ఉటంకించగా, ఆమె స్పందిస్తూ ‘భూసేకరణ, సమస్యలు గందరగోళంగా ఉన్నాయనడం కంటే అది చాలా పెద్ద సమస్య అనడం కరెక్ట్. ఇది వృద్ధికి, తయారీ రంగానికి ఒక పెద్ద సవాలు. అయితే భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు కొత్త పద్ధతులతో ప్రయోగాలు చేస్తున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూ వినియోగం, భూ సంబంధిత విషయాల్లో సృజనాత్మకమైన పద్ధతులను అనుసరిస్తూ మంచి పనితీరు కనబరుస్తోందని నేను భావిస్తున్నాను. ల్యాండ్ టైట్లింగ్ అంశంపై గట్టిగా ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం’ అని స్పష్టం చేశారు.
విస్తృత అధ్యయనం తర్వాతే అమలు యత్నం
గీతా గోపీనాథ్ చెప్పిన అంశాలు జగన్ హయాంలో జరిగినవే. ఆమె ఉదహరించిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం వస్తే భూముల వ్యవస్థ సమూలంగా మారిపోతుందని ప్రపంచం మొత్తం నమ్ముతోంది. అందుకే దానిపై విస్తృతమైన అధ్యయనం చేశాక దేశంలోనే తొలిసారిగా వైఎస్ జగన్ దాన్ని ఏపీలో అమలు చేసేందుకు చట్టాన్ని చేశారు. కేంద్రం ఆమోదం కూడా తీసుకున్నాక అమలు చేసేందుకు ప్రయత్నించారు.
కానీ చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఆ చట్టం వస్తే మీ భూములు పోతాయని, జగన్ ప్రజల భూములన్నీ లాగేసుకుంటాడని ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేశారు. దానిపై దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా.. ఎల్లో మీడియా పత్రికలో ఒక ఫుల్ పేజీ వ్యతిరేక ఎడ్వర్‌టైజ్‌మెంట్ ఇవ్వడాన్ని బట్టి ఏ స్థాయిలో తప్పుడు ప్రచారం చేశారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర గతిని మార్చే చట్టాన్ని ఎన్నికల్లో వివాదాస్పదంగా మార్చిన చంద్రబాబు.. ప్రజల్లో లేనిపోని భయాందోళనలు రేకెత్తించారు.
అప్పటికి ఆ చట్టం ఇంకా అమల్లోకి రాకపోయినా అది అమలై పోతున్నట్లు, భూములు పోయినట్లు ప్రచారం చేసి తాను అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని రద్దు చేస్తానని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రయోజనాల కంటే తన సొంత ప్రయోజనాలే ప్రధానమని దేశానికే రోల్ మోడల్‌గా మారిన చట్టాన్ని రద్దు చేశారు. అయితే దాంతో ముడిపడి ఉన్న భూముల రీ సర్వేను మాత్రం కొనసాగిస్తూ యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు అదే రీ సర్వే క్రెడిట్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
దావోస్‌లో గీతా గోపీనాథ్ చేసిన వ్యాఖ్యలు జగన్ అమలు చేసిన విప్లవాత్మకమైన భూ సంస్కరణలను మళ్లీ తెరపైకి తెచ్చాయి. చంద్రబాబు అదే దావోస్‌కు వెళ్లి తన పాలన గొప్పగా జరుగుతున్నట్లు ఎన్ని మైకుల్లో ఉదరగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ జగన్ ఎప్పుడూ దావోస్‌కు వెళ్లకపోయినా, ఆయన చేసిన మంచి పనులు, భూ సంస్కరణలు అక్కడ చర్చకు వచ్చాయి. దీన్నిబట్టి ఎవరి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
రాజకీయ స్వార్థం కోసం మంచి చట్టాలు, మంచి పనుల్ని చంద్రబాబు రద్దు చేసినా.. వాటి ఫలితం, ప్రభావం ఎలా ఉంటుందో దావోస్ వేదికగా బయట పడింది. చంద్రబాబు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పొందుదామనుకున్న క్రెడిట్‌ను జగన్.. తన హయాంలో చేసిన మంచి పనుల ద్వారా సాధించడం గమనార్హం.


