ఒకే పథకం.. ఒకటికి మించి ప్రయోజనాలు | Fund Review Canara Robeco Emerging Equity Fund | Sakshi
Sakshi News home page

ఒకే పథకం.. ఒకటికి మించి ప్రయోజనాలు

Nov 8 2021 8:55 AM | Updated on Nov 8 2021 3:03 PM

Fund Review Canara Robeco Emerging Equity Fund - Sakshi

Canara Robeco Emerging Equity Fund: లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో వృద్ధి సామర్థ్యాలు అధికంగా ఉంటాయి. అందుకే లార్జ్‌క్యాప్‌లో రిస్క్‌ తక్కువ. మిడ్‌క్యాప్‌లో స్వల్పకాలానికి కొంత రిస్క్‌ ఉన్నా కానీ, దీర్ఘకాలంలో రాబడులు అధికంగా ఉంటాయి. ఈ రెండు రకాల ప్రయోజనాలను ఒకే మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో పొందాలంటే అందుకు.. కెనరా రొబెకో ఎమర్జింగ్‌ ఈక్విటీ ఫండ్‌ను పరిశీలించొచ్చు. లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ విభాగంలో ఈ పథకం మెరుగ్గా పనిచేస్తోంది. 2018కి ముందు ఈ పథకం మిడ్‌క్యాప్‌ ఫండ్‌గా కొనసాగగా.. సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల పునర్‌వ్యవస్థీకరణ నిబంధనల తర్వాత లార్జ్‌అండ్‌ మిడ్‌క్యాప్‌ పథకంగా మారింది. లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ పథకాలు తమ నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో కనీసం 35 శాతం చొప్పున లార్జ్‌క్యాప్‌లో, మిడ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. మిగిలిన పెట్టుబడులను భిన్న మార్కెట్‌ కేటగిరీల్లోని స్టాక్స్‌కు కేటాయించుకోవచ్చు.  
పనితీరు 
పోటీ పథకాల కంటే ఈ విభాగంలో కెనరా రొబెకో ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌ మెరుగైన పనితీరును గత కొన్ని సంవత్సరాలుగా నమోదు చేస్తోంది. 5స్టార్‌ రేటింగ్‌ పథకం ఇది. గడిచిన ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై 61 శాతం రాబడులను అందించింది. ఇదే కాలంలో లార్జ్‌అండ్‌ మిడ్‌క్యాప్‌ విభాగం సగటు రాబడులు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి. మూడేళ్ల కాలంలోనూ వార్షిక రాబడుల చరిత్ర 24 శాతంగా ఉంది. కానీ, ఇదే కాలంలో లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ విభాగం సగటు రాబడులు 20.51 శాతంగానే ఉన్నాయి. ఐదేళ్లలో 18 శాతం, ఏడేళ్లలో 18 శాతం, పదేళ్లలో 23 శాతం చొప్పున వార్షిక రాబడులను ఈ పథకం ఇచ్చింది. 2005 మార్చిలో ఈ పథకం ప్రారంభం కాగా, నాటి నుంచి చూసుకున్నా వార్షిక రాబడుల రేటు 18.35 శాతంగా ఉంది. పాయింట్‌ టు పాయింట్‌ రాబడులను పరిశీలించినా.. మూడేళ్లు, ఐదేళ్ల కాలంలో టాప్‌–3లో ఈ పథకం ఒకటిగా కనిపిస్తుంది. గడిచిన మూడేళ్లలో మార్కెట్లు నష్టపోయిన సమయంలో ఈ పథకం నష్టాలను పరిమితం చేయడాన్ని కూడా గమనించాలి. అంతేకాదు, మార్కెట్‌ ర్యాలీల్లోనూ ముందుంది.  
పోర్ట్‌ఫోలియో  
బలమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీలను పెట్టుబడులకు ఎంపిక చేసుకుంటుంది. మంచి పోటీనిచ్చే సత్తా, సహేతుక వ్యాల్యూషన్ల వద్దనున్న స్టాక్స్‌ను గుర్తించి ఇన్వెస్ట్‌ చేస్తుంది. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌కు కేటాయింపులు చేయడం వల్ల పథకం పనితీరుకు స్థిరత్వాన్నిస్తుంది. గడిచిన మూడేళ్లలో ఈ పథకం సగటున లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌కు 84–95 శాతం మధ్య కేటాయింపులు చేసింది. ప్రస్తుతం కూడా లార్జ్, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో 97 శాతం పెట్టుబడులు పెట్టి ఉంది. స్మాల్‌క్యాప్‌ విభాగానికి కేటాయింపులు 3 శాతంగా ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 28 శాతం ఈ రంగాల స్టాక్స్‌కు కేటాయించింది. ఆ తర్వాత హెల్త్‌కేర్, సేవలు, ఆటోమొబైల్, టెక్నాలజీ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేసింది.
టాప్‌ ఈక్విటీ హోల్డింగ్స్‌ 
కంపెనీ                 పెట్టుబడుల శాతం 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు              5.31 
ఐసీఐసీఐ బ్యాంకు                  4.65 
ఇన్ఫోసిస్‌                              4.03 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌             3.70 
బజాజ్‌ ఫైనాన్స్‌                     3.37 
యాక్సిస్‌బ్యాంకు                    3.25 
ఎస్‌బీఐ                                2.75 
మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌                    2.36 
మిండా ఇండస్ట్రీస్‌                 2.36 
అవెన్యూ సూపర్‌మార్ట్స్‌           2.11 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement