లిటిల్‌ ఫ్రెండ్స్‌ కోసం.. సూపర్ గాడ్జెట్స్‌ | Friendly Gadgets For Little Friends | Sakshi
Sakshi News home page

లిటిల్‌ ఫ్రెండ్స్‌ కోసం.. సూపర్ గాడ్జెట్స్‌

Jun 1 2025 12:57 PM | Updated on Jun 1 2025 1:07 PM

Friendly Gadgets For Little Friends

హుషారుగా ఆడుకుంటూ, సరదాగా నేర్పించే మ్యాజిక్‌ మెషిన్స్‌ను తెలివిగా వాడుకుంటే, ఏ పిల్లలైనా చదువుల్లోనే కాదు, ఆరోగ్యంపైన కూడా శ్రద్ధ చూపిస్తారు. పిల్లల కోసం టెక్నాలజీ అందించిన ఫ్రెండ్లీ గాడ్జెట్స్‌ మీ కోసం..

బ్రషింగ్‌ గేమ్‌ ఆడుదాం!
చిన్నపిల్లలకు బ్రషింగ్‌ చేయించడం అంటే  మినీ యుద్ధం చేయటంలాంటిది. శత్రుసైన్యంగా ఉండే టూత్‌పేస్ట్‌కి టార్చర్‌. బ్రష్‌కు బ్రేకప్‌.. ఇలా పేస్ట్, బ్రష్‌లతో పేరెంట్స్‌ పిల్లలకు బ్రషింగ్‌ చేయించడానికి పోరాడుతుంటారు. ఇప్పుడు ఈ యుద్ధానికి ఒక చిన్న టూత్‌బ్రష్‌ స్వస్తి పలికింది.

'విల్లో అటో ఫ్లో’ కేవలం టూత్‌బ్రష్‌ మాత్రమే కాదు. ఇదొక అటోమెటిక్‌ బ్రషింగ్‌ డివైజ్‌. బలమైన, మృదువైన బ్రిసిల్స్‌తో ఇది చాలా సులభంగా పిల్లలకు బ్రషింగ్‌ చేయిస్తుంది. నీళ్లు తానే తీసుకుంటుంది. పేస్ట్‌ తానే ఇస్తుంది. దీనిని మొబైల్‌ యాప్‌కు కనెక్ట్‌ చేసుకొని వాడితే, మరింత ఆసక్తికరంగా పనిచేస్తుంది.

‘క్యావిటీ కిల్లర్‌’ టైటిల్‌తో యాప్‌లో పిల్లలతో బ్రషింగ్‌ గేమ్‌ ఆడేలా చేస్తుంది. వివిధ కౌంట్‌డౌన్‌లు, బ్యాడ్జ్‌లు, రివార్డ్స్‌ ఇస్తూ వారికి బ్రషింగ్‌ అంటే ఇకపై యుద్ధంలా కాకుండా, ఒక సరదా ఆటలా కనిపించేలా చేస్తుంది. ఇక అప్పటి నుంచి టూత్‌పేస్ట్‌ బాత్‌రూమ్‌ గోడలపై కాదు, పళ్లపై ఉంటుంది. ధర 249 డాలర్లు (రూ.21,266).

ఉఫ్‌.. ఉఫ్‌.. పిల్లి
చూడటానికి చిన్నగా కనిపించే ఈ బుజ్జి పిల్లి. చేసే పని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏ పిల్లి అయినా తన తోక నొక్కితే వెంటనే ‘మ్యావ్‌.. మ్యావ్‌..’ అంటూ బయటకు వినిపించని బూతులెన్నో తిడుతుంది. కాని, ‘నికోజిటా ఫు ఫు’ అనే ఈ పిల్లి మాత్రం దీని తోకకున్న బటన్‌ నొక్కగానే ‘ఉఫ్‌.. ఉఫ్‌..’ అంటూ వేడి వేడిగా ఉండే ఫుడ్‌ని కేవలం మూడు నిమిషాల్లోనే ‘ఇప్పుడు లాగించొచ్చు’ అనే స్థితిలోకి వచ్చేలా చల్లారుస్తుంది.

చిన్నపిల్లలు ఉండే ఇంట్లో దీని అవసరం చాలా ఉంటుంది. ప్లేట్, బౌల్, కప్పు ఇలా ఏ వస్తువుకైనా ఈజీగా దీనిని తగిలించుకొని ఉపయోగించుకోవచ్చు. రీచార్జబుల్, వాషబుల్‌. ఒక్కసారి చార్జ్‌ చేస్తే దాదాపు ఒక గంట వరకు పనిచేస్తుంది. ధర 27 డాలర్లు (రూ. 2,303) మాత్రమే!

పీస్‌ఫుల్‌ గుడ్‌
ఇల్లు పీకి పందిరేసే పిల్లలతో కూడా శాంతి మత్రం జపించేలా చేయగలడు ఇతడు. చూడ్డానికి చాలా చిన్నగా ఒక చిన్న పక్షి గుడ్డు సైజులో ఉంటాడు. తాకి చూస్తే దూది కంటే మెత్తగా ఉంటాడు. కాని, మహా మొండి ఘటాల్లాంటి పిల్లలను కూడా ప్రశాంతంగా మార్చేస్తాడు. ఇంతకీ మార్కెట్‌లోకి వచ్చిన ఈ కొత్త యోగా గురువు పేరు ఏంటంటే ‘మూడ్‌ బడ్డీ’.

దీనిని ఒక పది నిమిషాలు పిల్లల చేతికి అందిస్తే చాలు, వెంటనే ప్రశాంతంగా మారిపోతారు. ఇందులో నాలుగు రకాల బ్రీతింగ్‌ మోడ్స్‌ ఉంటాయి. ఇందులో వివిధ వాయిస్‌ కమాండ్స్, వైబ్రేషనల్‌ మోడ్స్‌ ఉంటాయి. ఇవి క్షణాల్లో మెదడును శాంతపరిచి, సెలెంట్‌ మోడ్‌లోకి తీసుకురావడానికి ఉపయోగపడతాయి. రోజూ దీనిని వాడితే ప్రశాంతంగా మారడమే కాదు, సరైన సమయానికి నిద్ర కూడా పోతారట. ధర 99 డాలర్లు (రూ.8,458).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement