breaking news
Little Champion
-
లిటిల్ ఫ్రెండ్స్ కోసం.. సూపర్ గాడ్జెట్స్
హుషారుగా ఆడుకుంటూ, సరదాగా నేర్పించే మ్యాజిక్ మెషిన్స్ను తెలివిగా వాడుకుంటే, ఏ పిల్లలైనా చదువుల్లోనే కాదు, ఆరోగ్యంపైన కూడా శ్రద్ధ చూపిస్తారు. పిల్లల కోసం టెక్నాలజీ అందించిన ఫ్రెండ్లీ గాడ్జెట్స్ మీ కోసం..బ్రషింగ్ గేమ్ ఆడుదాం!చిన్నపిల్లలకు బ్రషింగ్ చేయించడం అంటే మినీ యుద్ధం చేయటంలాంటిది. శత్రుసైన్యంగా ఉండే టూత్‌పేస్ట్‌కి టార్చర్. బ్రష్‌కు బ్రేకప్.. ఇలా పేస్ట్, బ్రష్‌లతో పేరెంట్స్ పిల్లలకు బ్రషింగ్ చేయించడానికి పోరాడుతుంటారు. ఇప్పుడు ఈ యుద్ధానికి ఒక చిన్న టూత్‌బ్రష్ స్వస్తి పలికింది.'విల్లో అటో ఫ్లో’ కేవలం టూత్‌బ్రష్ మాత్రమే కాదు. ఇదొక అటోమెటిక్ బ్రషింగ్ డివైజ్. బలమైన, మృదువైన బ్రిసిల్స్తో ఇది చాలా సులభంగా పిల్లలకు బ్రషింగ్ చేయిస్తుంది. నీళ్లు తానే తీసుకుంటుంది. పేస్ట్ తానే ఇస్తుంది. దీనిని మొబైల్ యాప్‌కు కనెక్ట్ చేసుకొని వాడితే, మరింత ఆసక్తికరంగా పనిచేస్తుంది.‘క్యావిటీ కిల్లర్’ టైటిల్‌తో యాప్‌లో పిల్లలతో బ్రషింగ్ గేమ్ ఆడేలా చేస్తుంది. వివిధ కౌంట్డౌన్లు, బ్యాడ్జ్‌లు, రివార్డ్స్ ఇస్తూ వారికి బ్రషింగ్ అంటే ఇకపై యుద్ధంలా కాకుండా, ఒక సరదా ఆటలా కనిపించేలా చేస్తుంది. ఇక అప్పటి నుంచి టూత్‌పేస్ట్ బాత్రూమ్ గోడలపై కాదు, పళ్లపై ఉంటుంది. ధర 249 డాలర్లు (రూ.21,266).ఉఫ్.. ఉఫ్.. పిల్లిచూడటానికి చిన్నగా కనిపించే ఈ బుజ్జి పిల్లి. చేసే పని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏ పిల్లి అయినా తన తోక నొక్కితే వెంటనే ‘మ్యావ్.. మ్యావ్..’ అంటూ బయటకు వినిపించని బూతులెన్నో తిడుతుంది. కాని, ‘నికోజిటా ఫు ఫు’ అనే ఈ పిల్లి మాత్రం దీని తోకకున్న బటన్ నొక్కగానే ‘ఉఫ్.. ఉఫ్..’ అంటూ వేడి వేడిగా ఉండే ఫుడ్‌ని కేవలం మూడు నిమిషాల్లోనే ‘ఇప్పుడు లాగించొచ్చు’ అనే స్థితిలోకి వచ్చేలా చల్లారుస్తుంది.చిన్నపిల్లలు ఉండే ఇంట్లో దీని అవసరం చాలా ఉంటుంది. ప్లేట్, బౌల్, కప్పు ఇలా ఏ వస్తువుకైనా ఈజీగా దీనిని తగిలించుకొని ఉపయోగించుకోవచ్చు. రీచార్జబుల్, వాషబుల్. ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు ఒక గంట వరకు పనిచేస్తుంది. ధర 27 డాలర్లు (రూ. 2,303) మాత్రమే!పీస్ఫుల్ గుడ్ఇల్లు పీకి పందిరేసే పిల్లలతో కూడా శాంతి మత్రం జపించేలా చేయగలడు ఇతడు. చూడ్డానికి చాలా చిన్నగా ఒక చిన్న పక్షి గుడ్డు సైజులో ఉంటాడు. తాకి చూస్తే దూది కంటే మెత్తగా ఉంటాడు. కాని, మహా మొండి ఘటాల్లాంటి పిల్లలను కూడా ప్రశాంతంగా మార్చేస్తాడు. ఇంతకీ మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త యోగా గురువు పేరు ఏంటంటే ‘మూడ్ బడ్డీ’.దీనిని ఒక పది నిమిషాలు పిల్లల చేతికి అందిస్తే చాలు, వెంటనే ప్రశాంతంగా మారిపోతారు. ఇందులో నాలుగు రకాల బ్రీతింగ్ మోడ్స్ ఉంటాయి. ఇందులో వివిధ వాయిస్ కమాండ్స్, వైబ్రేషనల్ మోడ్స్ ఉంటాయి. ఇవి క్షణాల్లో మెదడును శాంతపరిచి, సెలెంట్ మోడ్‌లోకి తీసుకురావడానికి ఉపయోగపడతాయి. రోజూ దీనిని వాడితే ప్రశాంతంగా మారడమే కాదు, సరైన సమయానికి నిద్ర కూడా పోతారట. ధర 99 డాలర్లు (రూ.8,458). -
అమ్మ పాటే అసలు ఛాంపియన్!
‘‘తల్లివి నీవే... తండ్రివి నీవే...’ మూడేళ్ల వయసులో హర్ష పాడిన ఫస్ట్ సాంగ్ ఇది! ఇప్పుడు? ఐదు వందల స్టేజ్ షోల లిటిల్ చాంపియన్!! ‘అంతా ఆమె త్యాగం’ అంటారు హర్ష నాన్నగారు. ‘తల్లీబిడ్డల మధ్య త్యాగం ఏమిటీ... ఇది దైవానుగ్రహం’ అంటారు హర్ష తల్లి. పదిహేనేళ్ల క్రితం... వేణు కీబోర్డ్ ప్లేయర్‌గా... శాంతి ఆర్కెస్ట్రా సింగర్‌గా... ఉన్నప్పుడు... హర్ష పుట్టాడు, నేనూ పాడతానని అమ్మ మీదికి ఎగబాకాడు. అలా... హర్షకు పాటే ‘లాలిపాఠం’ అయింది. అయితే ఆ పాఠాన్ని రాగయుక్తం చేసిన తల్లీ, తండ్రీ భగవంతుడేనని శాంతి అంటున్నారు. సాయి దేవ హర్ష... ఈ లిటిల్ చాంప్ టీవీ వీక్షకులకు సుపరిచితుడు. పాటలతోటలో విహరిస్తున్నట్లు పాడుతుంటాడు. పాట పాడేటప్పుడుచేప నీటిలో ఈదుతున్నంత సౌకర్యంగా కనిపిస్తాడు. ఇదంతా మీ శిక్షణలోనే అలవడిందా అని అడిగినప్పుడు సాయి పేరెంట్స్ శాంతి, వేణుమాధవ్ ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ‘మమ్మల్ని ఒకరికొకర్ని పరిచయం చేసింది, ప్రేమను పెంచిందీ, ఏడడుగులు వేయించింది కూడా పాటల వేదికే. అందుకే హర్షకు పాట, పాటల వేదిక కొత్త కాదు’ అంటారు శాంతి. ‘‘నేను ఆర్కెస్ట్రా బృందంలో పాటలు పాడేదాన్ని, మావారు కీబోర్డు ప్లేయర్. పెళ్లయిన తర్వాత ఇద్దరం ప్రోగ్రామ్‌లు చేసేవాళ్లం. హర్ష పుట్టిన తర్వాత ముగ్గురం వెళ్లాల్సి వచ్చేది. ఊహ తెలియక ముందు నుంచి స్టేజిని చూస్తూ పెరిగాడు, కడుపులో ఉన్నప్పటి నుంచి ఆర్కెస్ట్రా వింటున్నాడు. రెండేళ్ల వయసులో దువ్వెన నోటి దగ్గర పెట్టుకుని రాగం తీసేవాడు. సరదాగా ఒకపాట నేర్పిస్తే త్వరగానే నేర్చుకున్నాడు. ప్రోగ్రామ్‌లో నాతోపాటు డయాస్ మీదకు వచ్చి పాడాలని పరుగులు తీసేవాడు. హర్షకు మూడేళ్లప్పుడు ప్రోగ్రామ్ నిర్వాహకులను రిక్వెస్ట్ చేసి ఒక పాట పాడించాను. ‘తల్లివి నీవే... తండ్రివి నీవే...’ పాట మొత్తం పాడాడు’’ అంటూ హర్ష బాల్యాన్ని, పాటల ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు శాంతి. ఫాలోఅప్ నాది ... శ్రమ శాంతిది ! హర్ష పాటల ప్రయాణంలో మైలురాళ్లను, శాంతి పడిన ప్రయాసను గుర్తు చేసుకున్నారు వేణుమాధవ్... ‘‘నాకు బాలభారతి స్కూల్లో ఉద్యోగం. హర్షతో ప్రోగ్రామ్‌లకు వెళ్లడానికి కుదిరేది కాదు. ఆ శ్రమంతా శాంతిదే. వీళ్లిద్దరినీ వైజాగ్‌లో రెలైక్కించినప్పటి నుంచి అక్కడ బసకు చేరడం, తిరిగి అక్కడ రెలైక్కడం వరకు ఫోన్లో ఫాలో అప్ చేస్తుంటాను. వీళ్లకు ఇబ్బంది కలిగితే సహాయం చేయడానికి ఆ ఊర్లో ఉన్న ఫ్రెండ్స్‌కి సమాచారం ఇచ్చేవాడిని. ప్రాక్టీస్ విషయానికి వస్తే హర్షని మ్యూజిక్ క్లాస్‌లో దించడం వరకే నా పాత్ర. ఎవరి దగ్గర నేర్పించాలి, ఎగ్జామ్స్, ప్రోగ్రామ్‌లు, డబ్బు పొదుపు, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్లు శాంతి చూసుకుంటుంది’’ అన్నారు. హర్ష సంపాదన పరుడైన తర్వాత తల్లిగా తన పాత్ర మరింత కీలకమైంది అంటున్నారు శాంతి. ‘‘నేను అనుక్షణం గుర్తు చేసుకునే విషయం మారిన ఆర్థిక పరిస్థితులు ఒక్కటే. పెళ్లయిన తర్వాత చాలా రోజులు రేపటి గురించిన భయంతోనే గడిపాం. దేవుడు హర్షరూపంలో అదృష్టాన్నిచ్చాడు. ‘డబ్బు చూసి గర్వపడకూడదు, దేవుడి ప్రసాదంలా వాడుకోవాలి’ అని హర్షతో చెప్తుంటాను. ఐదేళ్లలో ఐదువందల స్టేజ్ షోలు చేశాడు. వచ్చిన డబ్బుని హర్ష భవిష్యత్తు కోసమే దాస్తున్నాం. ఐటి రిటర్న్స్ కచ్చితంగా చూస్తున్నాం. శ్రీ ప్రకాశ్ విద్యానికేతన్ వాళ్లు హర్షకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అప్పటి మా పరిస్థితిలో ఒకరు చాలనుకున్నాం. కానీ ఇప్పుడు మరో బిడ్డను పెంచే స్థోమత ఆ దేవుడే ఇచ్చాడు. మమ్మల్ని బంధువులు కలుపుకోకపోవడంతో హర్ష బెంగపెట్టుకుంటాడేమోనని మరో బిడ్డ కావాలనుకున్నాం’’ అంటూ ఏడాదిన్నర పాపాయి ‘సాయి వేద వాగ్దేవి’ని చూపించారామె. దేవుడి సంకల్పం! దేవ హర్ష, వేద వాగ్దేవి పేర్లలో అక్షరాల అల్లికను చెప్తూ... ‘దేవ, వేద అనే చమత్కారం తనదే’నంటూ ‘పాప కూడా సంగీతంలో రాణించాలని సరస్వతీదేవి పేరు పెట్టాను’ అన్నారు శాంతి. ఈ పెంపకంలో మరో గాయనిని తయారుకాబోతోందన్నమాట అన్నప్పుడు ఆమె ఆ క్రెడిట్ పెంపకానిది కాదు దేవుడిచ్చే అవకాశం అన్నారు. ‘‘అనుకోకుండా అవకాశాలు వస్తాయి. వాటిని నిలబెట్టుకోవడం మన బాధ్యత- అని చెబుతుంటాను. సరిగ్గా మాట్లాడడం కూడా రాని వయసులో అంతమంది ముందు ఇంత జ్ఞానంతో పాట పాడుతున్నారంటే అది దేవుడి అనుగ్రహం తప్ప పెంపకంతో వచ్చేది కాదని నా అభిప్రాయం. అలాగే పిల్లలకు తమ పాట మాత్రమే గొప్ప కాదని, పాట రాణించాలంటే ఆర్కెస్ట్రా సహకారం కీలకమనే విషయమూ తెలియచేయాలి’’ అని శాంతి చెప్తున్నప్పుడు ఆమె మాటల్లో తాను చూసిన ప్రపంచాన్ని పిల్లవాడికి కరతలామలకం చేయిస్తున్నట్లు అనిపించింది. అది పుత్రోత్సాహం! హర్షకు మ్యూజిక్ కంపోజింగ్ పట్ల ఆసక్తిని వివరిస్తూ వేణుమాధవ్ ‘‘ఒకసారి స్టూడియోలో ఆర్కెస్ట్రా కీ బోర్డు రెడీ చేసుకున్నారు. హర్ష వాళ్లతో ‘అంకుల్! పాటకు కీ బోర్డు మ్యాచ్ కావడం లేదు’ అన్నాడు. వాళ్లు సరిగానే ఉందన్నా ఒప్పుకోలేదు. ఫంక్షన్స్లోకెళ్లి పరిశీలిస్తే 440 బదులు 430 ఉంది. ఇది చాలా సూక్ష్మమైన తేడా. కీబోర్డు ప్లేయర్నైన నా చెవులు కూడా ఆ చిన్నపాటి తేడాని పసిగట్టలేకపోయాయి. మరోసారి సింహాచలంలో కూడా అలాగే జరిగింది. తబలా శృతి చేస్తున్నారు... మాకు తెలిసినంత వరకు శృతిలోనే ఉంది. హర్ష మాత్రం శృతి కలవడం లేదన్నాడు. అప్పుడు ఎలక్ట్రానిక్ మెషిన్ ట్యూనర్తో టెస్ట్ చేస్తే గ్రీన్ లైట్ వెలగలేదు. శృతి కచ్చితంగా కలిస్తేనే గ్రీన్ లైట్ వెలుగుతుంది. శృతిని అంత సునిశితంగా పట్టేస్తాడు. తండ్రిగా, కీ బోర్డు ప్లేయర్‌గా నేను గర్వపడిన సంఘటనలు ఈ రెండూ’’ అంటూ మురిసిపోయారు. హర్షని మ్యూజిక్ కంపోజిషన్ వైపు ప్రోత్సహిస్తున్నారా అన్నప్పుడు... ‘‘తనకు కంపోజింగ్ ఇష్టమని ఈ మధ్యనే తెలిసింది. గొంతు మారే సమయంలో పాటలకు గ్యాప్ తప్పదు. ఈ లోపు ప్రాక్టీస్ కోసం కీబోర్డు కొనిచ్చాం’’ అన్నారు శాంతి. ఇంతలో వేణుమాధవ్ నవ్వుతూ ‘‘ఆ కీబోర్డుతో రాత్రి ఒంటిగంటయినా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. నా బాధ చూసి ఇయర్‌ఫోన్స్ పెట్టుకుంటున్నాడు’’ అన్నారు. టీనేజ్‌లోకి అడుగుపెట్టడం, సెలబ్రిటీ ప్రత్యేకత తెలియడం వంటి మార్పులను ఎలా డీల్ చేస్తున్నారనే ప్రశ్నకు శాంతి... ‘‘సెలబ్రిటీ మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటాను. బయటి ఆహారం, జంక్‌ఫుడ్ విషయంలో ఎక్కువగా నచ్చచెప్పాల్సి వస్తోంది. ఫ్రెండ్స్ రకరకాలవి తింటుంటే హర్షకీ తినాలనిపిస్తుంది. గొంతు, కడుపును కాపాడుకోవాలంటే వాటిని తినకూడదంటాను’’ అన్నారు. పిల్లల మీద శ్రద్ధ పెట్టాల్సిందే! హర్ష కోసం శాంతి చేసిన త్యాగాల ముందు హర్ష సర్దుబాట్లు చాలా చిన్నవేనంటారు వేణుమాధవ్. ‘‘శాంతి ఫంక్షన్లకు వెళ్లడం మర్చిపోయింది. వాళ్ల అన్నయ్య ఇంటికి కూడా ఏడాదికి ఒకటి రెండు రోజులకంటే వెళ్లదు. ఒకరోజు ప్రోగ్రామ్‌కి వెళ్తే మూడు రోజులు తనకు ఓవర్ బర్డన్. ప్రయాణానికి ముందు అవసరమైన పనులు, ప్రయాణంలో పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోవడం కోసం తనకు నిద్ర సరిగా ఉండదు. స్కూలు మిస్సయిన రోజుల్లో పాఠాలను ప్రయాణంలోనే చదివించాలి. కళల్లో ఎంత రాణించినప్పటికీ అకడమిక్‌గా ఒక గ్రాడ్యుయేషన్ కోర్సు ఉండాలి. ఇప్పుడు వచ్చే మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని ఉపయోగించాలన్నా కూడా కంప్యూటర్ తెలిసి ఉండాలి. అందుకే బీటెక్ చేయాలని చెప్తున్నాను’’ అంటుండగా శాంతి అందుకుంటూ ‘‘నేను చేస్తున్నది త్యాగం అనకూడదు కానీ పిల్లలు ఎక్స్ట్రా కరిక్యులర్స్లో రాణించాలంటే తల్లిదండ్రుల్లో ఒకరైనా శ్రద్ధ పెట్టాలి’’ అన్నారు. పిల్లలు ఏదో సాధించాలనే కల చాలామంది తల్లిదండ్రులకు ఉంటుంది. అందుకు తగినంత శ్రమించడానికి సిద్ధమయ్యే వాళ్లు, త్యాగాలకు సిద్ధపడే వాళ్లు కొందరే ఉంటారు. శాంతి కచ్చితంగా అలాంటి తల్లే అనిపిస్తుంది. కానీ ఆమె మాత్రం దేవుడిచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చడానికి అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నాను అంటున్నారు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి పాటకంటే ప్రవర్తన ముఖ్యం! ఒక విజయంతో పలువురి దృష్టిని ఆకర్షించినంత ఈజీగా చిన్న పొరపాటుతో అంతకంటే ఎక్కువ చెడ్డపేరు కూడా వస్తుంది. అందుకే పిల్లలకు పాటకంటే జాగ్రత్తగా ప్రవర్తన నేర్పించాలి. ఎదురుగా ఉన్న వ్యక్తి ఎంత గొప్పవారనేది పిల్లలకు తెలియదు కాబట్టి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు చెప్తే తప్ప నమస్కారం చేయరు. ‘నువ్వు సెలబ్రిటీవి కాబట్టి ఎవరు వచ్చినా లేవాల్సిన అవసరం లేద’ని నేర్పించడం వల్ల పిల్లలు భవిష్యత్తును కోల్పోతారు. అలాగే పిల్లల ఆలోచనలను వివాదరహితంగా ఉంచడం చాలా ముఖ్యం. కాంపిటీషన్లో గెలవాలనే వెళ్తారెవరైనా. ఆ కోరిక ఒత్తిడిగా మారి పిల్లల మీద దాడి చేయకూడదు. తల్లిదండ్రుల ఒత్తిడి ఎక్కువైతే... పిల్లలు తమను తాము సంభాళించుకోలేక పోటీలో గెలవనప్పుడు ఏడ్చేస్తారు. చాలామంది తల్లిదండ్రులు చేసే మరో పొరపాటు... తమ పిల్లలకు మొదటిస్థానం రాకపోతే న్యాయనిర్ణేతల్లో తప్పులు వెతకడం. జడ్జిలు అందరి పాటనూ ఒకేతీరున పరిశీలిస్తారనే అభిప్రాయం కలిగించకపోతే పిల్లలకు కూడా తప్పులు పట్టే ధోరణి అలవాటవుతుంది. ఈ పరిణామం ఇంతటితో ఆగదు, మిగిలిన సింగర్స్‌తో కలివిడిగా ఉండలేరు. ఒంటరివారవుతారు. సాయిదేవహర్ష... 2007 సెప్టెంబరులో జీ తెలుగు ‘లిటిల్ చాంప్స్ సరిగమప’ విజేత. 2006లో చైల్డ్ ప్రాడిజీ సమైక్య భారత్ గౌరవ్ సత్కార్ గ్రహీత. అంతకంటే ముందు... స్వరాభిషేకం సినిమా పాటల పోటీలో సబ్‌జూనియర్ కేటగిరీలో బహుమతి. ఘంటసాల జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో సబ్‌జూనియర్ స్పెషల్ ప్రైజ్‌ని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిగారి చేతుల మీదుగా అందుకున్నాడు.