టాప్‌ 100 స్టార్టప్‌లలో భారత్‌ సంస్థలు.. దిగ్గజాల సరసన చోటు

Four Indian firms in WEF 100 most promising tech startups list - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఆశావహ, మార్గదర్శక 100 అంకుర సంస్థల జాబితాలో భారత్‌ నుంచి నాలుగు స్టార్టప్‌లు చోటు దక్కించుకున్నాయి. గిఫ్టోలెక్సియా సొల్యూషన్స్, జాక్‌మాజ్‌ టెక్నాలజీ, ఎవల్యూషన్‌క్యూ, నెక్ట్స్‌ బిగ్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌ ఇందులో ఉన్నాయి. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) దీన్ని రూపొందించింది.

పాఠశాల విద్యార్థుల్లో బోధనాంశాలను నేర్చుకోవడంలో లోపాలు తలెత్తే రిస్కులను గుర్తించే టెక్నాలజీ ఆధారిత సాధనాన్ని గిఫ్టోలెక్సియా అభివృద్ధి చేస్తోంది. ఈఎస్‌జీ (పర్యావరణం, సామాజిక, గవర్నెన్స్‌) ఇన్వెస్టింగ్‌కు ఉపయోగపడేలా శాటిలైట్‌ డేటాను విశ్లేషించే సాంకేతికతను జాక్‌మాజ్‌ రూపొందిస్తోంది. నెక్ట్స్‌ బిగ్‌ ఇన్నోవేషన్‌ సంస్థ.. 3డీ బయోప్రింటర్లను, ఎవల్యూషన్‌క్యూ సంస్థ .. క్వాంటమ్‌ టెక్నాలజీలకు సైబర్‌సెక్యూరిటీ ఉత్పత్తులను అందిస్తోంది.

వ్యాపారం, సమాజంపై గణనీయంగా ప్రభావం చూపగలిగే కొత్త సాంకేతికతలను ఆవిష్కరించే అంకుర సంస్థలతో డబ్ల్యూఈఎఫ్‌ 2000 నుంచి టెక్నాలజీ పయోనీర్స్‌ జాబితాను రూపొందిస్తోంది. ఈ ఏడాది లిస్టులో 31 దేశాలకు చెందిన స్టార్టప్‌లు చోటు దక్కించున్నాయి. అమెరికా నుంచి అత్యధికంగా 29 కంపెనీలు, తర్వాత చైనా నుంచి 12 సంస్థలు ఉన్నాయి. టెక్నాలజీ పయోనీర్స్‌గా ఎంపికైన అంకుర సంస్థలకు.. ఎయిర్‌బీఎన్‌బీ, గూగుల్, ట్విటర్‌ వంటి దిగ్గజాల సరసన చోటు దక్కుతుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top