సెజ్‌ నిబంధనల సరళతరంపై దృష్టి - పియుష్‌ గోయల్‌

Focus On Simplification of SEZ Rules - Sakshi

ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌) అభివృద్ధికి దోహదపడేలా కొన్ని నిబంధనలను సరళతరం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించి వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. వాణిజ్యం, కస్టమ్స్‌ సుంకాలపరంగా భారత్‌లోని సెజ్‌లను విదేశీ భాగంగా పరిగణిస్తారు. 

దేశీయంగా విక్రయించుకోవడానికి వీటిలోని యూనిట్లకు ఆంక్షలు వర్తిస్తాయి. వీటిని సడలించాలంటూ సెజ్‌లు కోరుతున్న నేపథ్యంలో గోయల్‌ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎగుమతులపై సుంకాల రీఫండ్‌కు సంబంధించిన ఆర్‌వోడీటీఈపీ పథకం ప్రయోజనాలను సెజ్‌లకు కూడా వర్తింపచేయాలన్న సెజ్‌ యూనిట్ల విజ్ఞప్తి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గోయల్‌ చెప్పారు. 

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలకు విరుద్ధంగా ఉండదని నమ్మకం కలిగినప్పుడు దాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. 2021లో ప్రవేశపెట్టిన ఈ పథకంలో యార్న్, డెయిరీ వంటి 8,500 పైచిలుకు ఉత్పత్తులను చేర్చినప్పటికీ.. సెజ్‌లు, ఎగుమతి ఆధారిత యూనిట్లను (ఈవోయూ) మాత్రం స్కీము నుంచి మినహాయించారు. 

ఎకానమీపై సమీక్ష
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి వ్యవహారాల శాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌ న్యూఢిల్లీలో బుధవారం సమావేశం అయినప్పటి చిత్రం ఇది. దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు, భారత్‌ అర్థిక వ్యవస్థపై పశ్చిమాసియా, రష్యా–ఉక్రేయిన్‌ యుద్ధం ప్రభావం వంటి కీలక అంశాలు ఈ చర్చల్లో భాగంగా ఉన్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) పురోగతిపై కూడా ఇరువురు అగ్రశ్రేణి మంత్రులు చర్చించినట్లు సమాచారం. రూపీలో భారత్‌ వాణిజ్యం మరింత పుంజుకోవడానికి తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top