ఫస్ట్‌ సిటిజన్స్‌ బ్యాంక్‌కు ఎస్‌వీబీ ఆస్తులు, డిపాజిట్లు

First Citizens Bank To Buy All Deposits, Loans Of Svb, Says Fdic - Sakshi

సిలికాన్‌ వ్యాలీ బ్యాంకు ఖాతాదారులకు ఊరట లభించింది. ఎఫ్‌డీఐసీ నియంత్రణలో ఉన్న సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ ఆస్తులు, డిపాజిట్లను ఫస్ట్‌ సిటిజన్స్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసింది.

శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడినట్లుగా తయారైంది అమెరికా ఆర్థిక పరిస్థితి. యావత్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అమెరికా సంక్షోభంలో చిక్కుకుంది. ప్రపంచ దేశాల్లో అత్యధిక కోవిడ్‌ మరణాల నమోదుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో కుదుట పడింది. అంతలోనే బ్యాంకుల దివాలా రూపంలో అనుకోని ఉపద్రవం వచ్చిపడింది.

ద్ర‌వ్యోల్బ‌ణాన్ని త‌ట్టుకునేందుకు అమెరికా ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ బ్యాంక్‌ గ‌త ఏడాది కాలంలో తొమ్మిది సార్లు (మార్చి 22 నాటికి ) వడ్డీ రేట్లు పెంచింది. దీంతో వడ్డీ రేట్ల పెంపుతో సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ), సిగ్నేచ‌ర్ బ్యాంకులకు నష్టాలు చుట్టుముట్టడంతో ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీఐసీ) రంగంలోకి దిగింది. ఆ రెండు బ్యాంకులను మూసివేసి తన నియంత్రణలోకి తీసుకుంది. 

ఈ తరుణంలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ చెందిన డిపాజిట్లు, రుణాలను ఫస్ట్‌ సిటిజన్స్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసింది. తద్వారా నేటి నుంచి ఎస్‌వీబీ డిపాజిటర్లంతా ఫస్ట్‌ సిటిజన్‌ బ్యాంక్‌ ఖాతాదారులుగా మారనున్నారు. కాగా, ఎఫ్‌డీఐసీ నియంత్రణలో ఉన్న సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌కు 2023 మార్చి 10 నాటికి 167 బిలియన్‌ డాలర్ల ఆస్తులు, 119 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. తాజా కొనుగోలులో 72 బిలియన్‌ డాలర్ల ఆస్తులను 16.5 బిలియన్‌ డాలర్ల రాయితీతో ఫస్ట్‌ సిటిజిన్‌ బ్యాంక్‌ సొంతం చేసుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top