ఆర్థిక వృద్ధిలో తైవాన్ టాప్.. భారత్ స్థానం ఎంతంటే? | Fastest Growing Asian Economies in 2026 Taiwan Leads and India Among top Performers | Sakshi
Sakshi News home page

Asian Economies 2026: ఆర్థిక వృద్ధిలో తైవాన్ టాప్.. భారత్ స్థానం ఎంతంటే?

Oct 9 2026 7:27 PM | Updated on Oct 9 2026 7:41 PM

Fastest Growing Asian Economies in 2026 Taiwan Leads and India Among top Performers

2026లో ఆసియా దేశాలు ప్రపంచ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడం, యుద్ధ భయాలు, అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితి వంటి సవాళ్లు ఉన్నప్పటికీ.. ఆసియాలోని పలు దేశాలు మంచి వృద్ధిని నమోదు చేస్తాయని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ, తయారీ రంగం, ఎగుమతులు, పెట్టుబడులు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు అండగా నిలుస్తున్నాయి.

ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) అంచనాల ప్రకారం.. 2026లో తైవాన్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆసియా ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ఈ జాబితాలో భారత్ కూడా చోటు దక్కించుకుంది. దేశ జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉండవచ్చని అంచనా వేయగా, ఆసియా దేశాల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది.

2026లో తైవాన్ ఆర్థిక వ్యవస్థ 11 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరుగుతుండటం, సెమీకండక్టర్లు, ఇతర టెక్నాలజీ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువ కావడం తైవాన్‌కు కలిసివస్తోంది. ముఖ్యంగా అమెరికా నుంచి పెరుగుతున్న డిమాండ్ ఆ దేశ ఎగుమతులకు ఊతమిస్తోంది. అయితే, తైవాన్ ఆర్థిక వృద్ధి ఎక్కువగా టెక్నాలజీ రంగంపై ఆధారపడుతోంది. భవిష్యత్తులో AI ఉత్పత్తులు, చిప్‌లకు డిమాండ్ తగ్గితే ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది.

ఈ జాబితాలో కిర్గిజ్‌స్థాన్ 8.9 శాతం వృద్ధి అంచనాతో రెండో స్థానంలో ఉండగా, వియత్నాం 7.8 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. వియత్నాం, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలు తరువాత వరుస స్థానాలను ఆక్రమించుకున్నాయి.  

ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానంలో నిలిచింది. 2026లో దేశ వాస్తవ జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉండవచ్చని అంచనా. దేశంలో పెట్టుబడులు పెరగడం, సేవల రంగం ఎగుమతులు బలంగా కొనసాగడం భారత ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, వ్యాపార సేవలు వంటి రంగాల్లో భారత్‌కు ఉన్న ప్రాధాన్యం ఆర్థిక వృద్ధికి తోడ్పడుతోంది. భారత్ తరువాత స్థానాల్లో.. భూటాన్, జార్జియా, తుర్క్‌మెనిస్థాన్, మంగోలియా దేశాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: బంగారం ధరలు జంప్.. అసలు కారణాలివే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement