ఎగుమతులు, దిగుమతుల్లో సానుకూలత

Exports and imports are showing positive trends says Piyush Goyal - Sakshi

వాణిజ్య లోటు దిగొస్తోంది

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

న్యూఢిల్లీ: ఎగుమతులు, దిగుమతుల ధోరణులు ఆశాజనకంగా ఉన్నాయని.. ముఖ్యంగా ఎగుమతులు ఈఏడాది ఏప్రిల్‌లో కరోనా కారణంగా భారీగా పడిపోయిన స్థాయి నుంచి క్రమంగా గత ఏడాది స్థాయిలకు చేరుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. ఎగుమతి ప్రోత్సాహక మండళ్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఈ వివరాలను వాణిజ్య శాఖ శుక్రవారం ఓ ప్రకటన రూపంలో విడుదల చేసింది.

క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, అంతర్జాతీయంగా భారత వాణిజ్యానికి సంబంధించిన అంశాలను చర్చించేందుకు మంత్రి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  మర్చండైజ్‌ ఎక్స్‌పోర్ట్‌ ఫ్రమ్‌ ఇండియా పథకం  కింద రాయితీలకు రూ.2 కోట్ల పరిమితి విధించడం 98%ఎగుమతిదారులపై ప్రభావం చూపించబోదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ పథకం స్థానంలో ఆర్వోడీటీఈపీ అనే కొత్త పథకాన్నిఇప్పటికే ప్రకటించడం గమనార్హం. వరుసగా ఐదో నెల జూలైలోనూ ఎగుమతులు 10% క్షీణించి 23.64 బిలియన్‌ డాలర్లుగా నమోదు కావడం గమనార్హం.   

మోదీ సర్కారు ‘ఆత్మనిర్భర్‌ షిప్పింగ్‌’
స్థానిక తయారీ టగ్‌ బోట్లనే వాడాలి ∙ ప్రధాన పోర్టులను కోరిన కేంద్రం
స్వావలంబన భారత్‌ (ఆత్మ నిర్భర్‌) కార్యక్రమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లే చర్యలను కేంద్రం అనుసరిస్తోంది. దేశీయంగా నిర్మించిన చార్టర్‌ టగ్‌ బోట్లనే వినియోగించాలంటూ ప్రధాన పోర్టులను (ఓడరేవులు) షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖా తాజాగా ఆదేశించింది. తద్వారా దేశీ షిప్‌ బిల్డింగ్‌ పరిశ్రమకు పునరుత్తేజాన్ని తీసుకురావచ్చన్నది కేంద్రం ఉద్దేశ్యం. ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమం కింద ఆత్మనిర్భర్‌ షిప్పింగ్‌ కోసం చేపట్టిన చర్యగా దీన్ని షిప్పింగ్‌ శాఖా మంత్రి మన్‌ సుఖ్‌ మాండవీయ అభివర్ణించారు. సవరించిన ఆదేశాలను ప్రధాన పోర్టులు పాటించాల్సి ఉంటుందన్నారు. టగ్‌ బోట్‌ అన్నది తొట్టి ఆకారంతో కూడిన పడవ. ఓడలు పోర్టుల్లోకి వచ్చేందుకు వీటి సాయం అవసరమవుతుంది. భారత షిప్‌ బిల్డింగ్‌ పరిశ్రమను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, భారత్‌లో షిప్‌ బిల్డింగ్‌ కోసం కొన్ని దేశాలతో చర్చలు కూడా కొనసాగుతున్నాయని కేంద్ర షిప్పింగ్‌ శాఖా తన ప్రకటనలో తెలిపింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top