నయా ట్రెండ్‌..  పెట్రోల్‌+ఎలక్ట్రిక్‌!  | Explanation of Plug-In Hybrid Electric Vehicles Special Story | Sakshi
Sakshi News home page

నయా ట్రెండ్‌..  పెట్రోల్‌+ఎలక్ట్రిక్‌! 

Jun 27 2026 5:41 AM | Updated on Jun 27 2026 5:41 AM

Explanation of Plug-In Hybrid Electric Vehicles Special Story

అటు సిటీ రైడ్‌..  ఇటు లాంగ్‌ డ్రైవ్‌ 

ప్లగ్‌–ఇన్‌ హైబ్రిడ్‌ కార్ల దూకుడు 

ఖర్చు తగ్గించే టెక్నాలజీ.. ఈ ఏడాది మరిన్ని కొత్త మోడల్స్‌

సిటీలో రోజూ 50–60 కిలోమీటర్ల జర్నీ.. వారాంతాల్లో విహారానికి అలా 300–400 కిలోమీటర్ల లాంగ్‌ రైడ్‌కు వెళ్లి రావాలి! ఎలక్ట్రిక్‌ కారు కొంటేనేమో దూర ప్రయాణాలకు రేంజ్‌ సమస్యతో పాటు చార్జింగ్‌ సదుపాయాలు ఇంకా సరిగ్గా అందుబాటులో లేవు. పోనీ పెట్రోలు కారైతే సిటీలో మెయింటెనెన్స్‌ ఖర్చు ఎక్కువ.

 మరి అటు నగర ప్రయాణాలకు పూర్తి ఎలక్ట్రిక్‌ కారు ఫీచర్స్‌.. ఇటు పెట్రోలు కారులా ఎంత దూరమైనా ప్రయాణించే చాన్సుంటే? ఒకే కారులో ఈ రెండు ఆప్షన్లు దొరికితే? అలాంటి వారి కోసమే ఇప్పుడు ప్లగ్‌–ఇన్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ కార్లు (పీహెచ్‌ఈవీ) దూసుకొస్తున్నాయి. విదేశీ వాహన దిగ్గజాలతో పాటు దేశీ కంపెనీలు కూడా ఈ హైబ్రిడ్‌ మోడళ్లను తీసుకొచ్చేందుకు సై అంటున్నాయి.  

భారత్‌లో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్‌ కార్ల (ఈవీ)పై ఆసక్తి పెరుగుతున్నప్పటికీ.. చార్జింగ్‌ స్టేషన్లు తక్కువగా ఉండటం.. దూర ప్రయాణాల్లో బ్యాటరీ అయిపోతుందేమోనన్న భయం కొనుగోలుదారులను పునరాలోచనలో పడేస్తున్నాయి. ఈవీ ఎకోసిస్టమ్‌ పూర్తిగా ఏర్పాటయ్యేందుకు చాలా ఏళ్లే పట్టేలా ఉంది. దీనికి మధ్యేమార్గంగా ఆటోమొబైల్‌ కంపెనీలు ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌ కార్లపై ఫోకస్‌ చేస్తున్నాయి. 

తాజాగా మెర్సిడెస్‌ బెంజ్‌ పాపులర్‌ ఎస్‌–క్లాస్‌లో తొలి పీహెచ్‌ఈవీ మోడల్‌ ‘ఎస్‌450ఈ’ని ప్రవేశపెట్టింది. దీనిలోని బ్యాటరీ పవర్‌ 110 కిలోమీటర్ల రేంజ్‌ (ఒక్కసారి పూర్తి చార్జింగ్‌తో ప్రయాణించే దూరం) అందిస్తుంది. పెట్రోల్‌ ఇంజిన్‌తో ఎంచక్కా నచ్చినంత దూరం జర్నీ చేయొచ్చు. మెర్సిడెస్‌తో పాటు బీఎండబ్ల్యూ, వోల్వో వంటి లగ్జరీ కార్ల దిగ్గజాలు ప్రస్తుతం మన దగ్గర పీహెచ్‌ఈవీలను విక్రయిస్తున్నాయి.

రేట్లు ఎక్కువే.. జీఎస్‌టీ తగ్గాలి
ఈవీలతో పోలిస్తే ప్రస్తుతం పీహెచ్‌ఈవీలు ఉపయోగకరమే అయినా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా అధిక రేట్లే ప్రధాన అడ్డంకి. పెట్రోల్‌ కార్లతో పోలిస్తే వీటి ధర సుమారు రూ. 15 లక్షలు ఎక్కువగా ఉంటోంది. చాలావరకు ప్రీమియం, లగ్జరీ విభాగంలోనే కంపెనీలు వీటిని తీసుకొస్తున్నాయి. వీటి ధరలు రూ.90 లక్షల నుంచి రూ. 2.5 కోట్ల రేంజ్‌లో ఉన్నాయి. మాస్‌ మార్కెట్‌కు అందుబాటులో లేవు. 

దీనికి తోడు ఈవీలకు 5 శాతం జీఎస్‌టీ ఉండగా.. పీహెచ్‌ఈవీలపై 40 శాతం ఫ్లాట్‌ జీఎస్‌టీ విధింపు వల్ల కూడా కొనుగోలుదారులపై అధిక భారం పడుతోంది. అందుకే వీటినీ ఈవీ కేటగిరీలోకి చేర్చాలనేది కంపెనీల డిమాండ్‌. కాగా, ధరలు తగ్గాలంటే స్థానిక అసెంబ్లింగ్‌ కూడా కీలకం. పూర్తిగా విదేశాల్లో తయారైన కార్లను దిగుమతి చేసుకోవడం వల్ల సుంకాల మోత మోగుతోంది. అందుకే సీకేడీ (వాహన విడిభాగాలను) దిగుమతి చేసుకుని దేశీయంగా అసెంబుల్‌ చేయడం వల్ల కూడా ధరలు భారీగా దిగొచ్చే అవకాశం ఉంటుంది.

ప్లగ్‌–ఇన్‌ హైబ్రిడ్‌ అంటే...
ప్లగ్‌–ఇన్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ కార్లలో విద్యుత్‌ మోటార్‌తో పాటు పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటాయి. ఇందులోని బ్యాటరీని ఇంట్లో లేదా పబ్లిక్‌ చార్జింగ్‌ పాయింట్‌ ద్వారా చార్జ్‌ చేయవచ్చు. బ్రేకులు వేస్తున్నప్పుడు కూడా కొంత పవర్‌ తిరిగి బ్యాటరీలో స్టోర్‌ అవుతుంది. ఇక బ్యాటరీ చార్జింగ్‌ తగ్గినప్పుడు లేదా ఎక్కువ దూరం వెళ్లాల్సి వచి్చనప్పుడు పెట్రోల్‌ ఇంజిన్‌ పనిచేస్తుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్లగ్‌ఇన్‌ హైబ్రిడ్‌ల రేంజ్‌ సుమారు 50–120 కిలోమీటర్లు. మన దేశంలో రోజువారీ సిటీ జర్నీ సుమారు 40–50 కిలోమీటర్ల మధ్యే ఉంటుంది. 

కాబట్టి పీహెచ్‌ఈవీలతో ఇంధన ఖర్చు దిగొస్తుంది. ఒకవేళ ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తే బ్యాటరీ అయిపోయాక పెట్రోల్‌ మోడ్‌లోకి మారడమే. ఇక మారుతీ గ్రాండ్‌ విటారా, హోండా సిటీ వంటి స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ కార్లలో పెట్రోలు ఇంజిన్లు సెల్ఫ్‌ చార్జింగ్‌ ద్వారా స్వయంగా కొంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని స్టోర్‌ చేసుకుంటాయి. వీటిని బయటి నుంచి చార్జింగ్‌ చేయాల్సిన అవసరం లేదు. అయితే, ఎలక్ట్రిక్‌ మోడ్‌లో ఇవి 1–3 కిలోమీటర్లే వెళ్లగలవు. కారు స్టార్ట్‌ చేసేటప్పుడు, సిగ్నల్స్‌ వద్ద ఇవి బ్యాటరీ పవర్‌ను వాడుకుంటాయి. దీనివల్ల కొద్దిగా ఇంధనం ఆదా అవుతుంది.

చైనా చలువతో మాస్‌మార్కెట్లోనూ...
ఇప్పటిదాకా లగ్జరీ సెగ్మెంట్‌కే పరిమితమైన ఈ హైబ్రిడ్‌ కార్లు.. చైనా కంపెనీల చలువతో ఇకపై మాస్‌ మార్కెట్‌కు కూడా అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా బీవైడీ ‘సీల్‌ యూ’తో పాటు జేఎస్‌డబ్ల్యూ మోటార్స్‌ – చైనాకు చెందిన చెరీ ఆటోమొబైల్‌ భాగస్వామ్యంతో తీసుకొస్తున్న ‘జెటూర్‌ టీ2’ ఎస్‌యూవీ రిలీజ్‌ కోసం కారు ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ రెండు ఎస్‌యూవీల్లోనూ పెట్రోల్‌ ఇంజిన్‌ పవర్‌తో పాటు 120 కిలోమీటర్ల పైగా బ్యాటరీ రేంజ్‌ ఉండటం విశేషం.

 సీల్‌ యూలో పెట్రోలు ఫుల్‌ ట్యాంక్, బ్యాటరీ ఫుల్‌ చార్జ్‌ చేస్తే.. 1,200 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా దూసుకుపోవచ్చు. జెటూర్‌ టీ2 అయితే పెట్రోల్‌+ఎలక్ట్రిక్‌ రేంజ్‌ 1,000 కి.మీ. అంతేకాదు, వీటి ధరలు సైతం రూ.45–50 లక్షల మధ్యలోనే ఉండొచ్చని అంచనా. మరోపక్క జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ సైతం ఎస్‌యూవీ 520 పీహెచ్‌ఈవీని ప్రవేశపెడుతోంది. ఇది కూడా చైనా జాయింట్‌ వెంచర్‌ సెయిక్‌–జీఎం–వులింగ్‌ (ఎస్‌జీఎండబ్ల్యూ) స్టార్‌లైట్‌ 560 క్రాసోవర్‌ ఎస్‌యూవీ రీబ్యాడ్జ్‌డ్‌ వెర్షన్‌.

    – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement