
ఈపీఎఫ్‌వోలో 20 లక్షల మంది నమోదు
9.42 లక్షల మంది కొత్త సభ్యులే
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌వో) సంస్థ కింద నికర సభ్యుల చేరిక కొత్త రికార్డులను తాకింది. ఈ ఏడాది మే నెలలో 20.06 లక్షలకు చేరుకుంది. ఇది ఆల్‌టైమ్ రికార్డు. ఏప్రిల్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే మేలో 4.79 శాతం అధిక ఉపాధి నెలకొనగా, గతేడాది మేతో పోల్చి చూస్తే 3 శాతం వృద్ధి సాధ్యమైంది.
మే నెలలో మొత్తం నికర సభ్యుల్లో 9.42 లక్షల మంది కొత్తగా ఉపాధి పొందిన వారు కావడం గమనార్హం. ఏప్రిల్‌తో పోల్చి చూస్తే 11 శాతం అధికం. మేనెల పేరోల్ గణాంకాలను కేంద్ర కారి్మక శాఖ సోమవారం విడుదల చేసింది. దేశ సంఘటిత రంగంలో ఉపాధి కల్పన బలంగా పెరుగుతోందనడానికి ఈ గణాంకాలు నిదర్శనమని కార్మిక మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి నుంచి సభ్యుల చేరిక స్థిరంగా పెరుగుతూ వస్తుండడాన్ని గమనించొచ్చు.
ఇతర ముఖ్యాంశాలు..
→ కొత్తగా చేరిన సభ్యుల్లో 5.60 లక్షల మంది 18–25 ఏళ్ల వయసులోని వారే. అంటే మొత్తం కొత్త సభ్యుల్లో వీరు 60%గా ఉన్నారు. ఏప్రిల్ నెలతో పోల్చి చూస్తే 14.53 శాతం పెరిగారు.
→ మేలో 18–25 ఏళ్ల వయసు నుంచి నికర సభ్యుల చేరిక 8.73 లక్షలుగా ఉంది.
→ 16.11 లక్షల మంది సభ్యులు లోగడ ఒక సంస్థలో ఉద్యోగం మానివేసి, మే నెలలో మరో సంస్థలో కొత్తగా చేరారు. ఏప్రిల్ నెలతో పోల్చి చూస్తే 2 శాతం, క్రితం ఏడాది మే నెలతో పోల్చి చూస్తే 14 శాతం వృద్ధి నమోదైంది.
→ ఈపీఎఫ్‌ఓలో కొత్త మహిళా సభ్యుల చేరిక 2.62 లక్షలుగా ఉంది. ఏప్రిల్ నెల కంటే ఇది 7 శాతం అధికం కాగా, గతేడాది మే నెలతో పోల్చి చూస్తే 6 శాతం పెరిగారు.
→ మే నెలలో మహిళా సభ్యుల నికర చేరిక 4.25 లక్షలుగా ఉంది. ఏప్రిల్ నెల కంటే 7.54 శాతం పెరిగింది.
→ నికర సభ్యుల చేరికలో మహారాష్ట్ర నుంచి 20.33 శాతం మంది ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, హరియాణా, ఢిల్లీ, యూపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 5 శాతానికిపైనే (విడిగా ఒక్కో రాష్ట్రం) సభ్యుల చేరిక నమోదైంది.