
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యుల ఖాతాల్లో పొదుపు నిధిపై.. 2024–25 సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ జమను ఈ వారంలోనే పూర్తి చేయనున్నట్టు కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ‘33.56 కోట్ల సభ్యులకు సంబంధించిన 13.88 లక్షల సంస్థల వార్షిక అకౌంట్ అప్‌డేషన్ పూర్తయింది. జులై 8 నాటికి 13.86 లక్షల సంస్థలకు చెందిన 32.39 కోట్ల సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ చేయడం ముగిసింది. అంటే ఇప్పటికే 96.51 సభ్యుల ఖాతాలకు వడ్డీ జమైంది’ అని మంత్రి వివరించారు.
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సభ్యుల నిధిపై, అంతకుముందు ఆర్థిక సంవత్సరం మాదిరే 8.25% వడ్డీ రేటును ఇవ్వాలని ఈపీఎఫ్‌వో ఫిబ్రవరి 28న నిర్ణయించగా.. కేంద్ర ప్రభుత్వం మే 22న ఆమోదం తెలపడం గమనార్హం. దీంతో జూన్ 6 నుంచే వార్షిక ఖాతాల అప్‌డేషన్ మొదలైనట్టు తెలిపారు. 2023–24 సంవత్సరానికి సంబంధించి ఆగస్ట్–డిసెంబర్‌లో వడ్డీ జమ జరిగింది.
వడ్డీ జమయిందో లేదో చూసుకోండిలా..
స్టెప్ 1: ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్ ( epfindia.gov.in )సందర్శించండి
స్టెప్ 2: అవర్ సర్వీసెస్ > ఫర్ ఎంప్లాయీస్ > మెంబర్ పాస్‌బుక్‌కు వెళ్లండి
లేదా నేరుగా ( passbook.epfindia.gov.in ) లింక్‌ను క్లిక్ చేయండి.
స్టెప్ 3: యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా ఉపయోగించి లాగిన్ అవ్వండి.
స్టెప్ 4: ఇక్కడ మీ అన్ని మెంబర్ ఐడీలు (మునుపటి, ప్రస్తుత కంపెనీలతో లింక్ అయినవి)కనిపిస్తాయి.
స్టెప్ 5: పాస్‌బుక్ చూడటానికి ప్రస్తుత మెంబర్ ఐడీపై క్లిక్ చేయండి
పాస్‌బుక్‌లో ఉద్యోగి కంట్రిబ్యూషన్, కంపెనీ కంట్రిబ్యూషన్, జమ అయిన వడ్డీ కనిపిస్తాయి. దీన్ని పీడీఎఫ్ గా కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.