
దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్ కస్టమర్లు చెల్లించే నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) తగ్గనున్నాయి. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన రుణ కాలపరిమితిపై ఎంసీఎల్ఆర్‌ను 15 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) అంటే 0.15% తగ్గించింది.
ఈ సవరణ తరువాత,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు రుణ కాలపరిమితిని బట్టి 9 శాతం నుంచి 9.20 శాతం వరకు ఉంటుంది. ఇది ఇంతకు ముందు 9.10 శాతం నుంచి 9.35 శాతం ఉండేది. సవరించిన రేట్లు మే 7 నుంచి అమల్లోకి వచ్చాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏప్రిల్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో తరువాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా ఎంసీఎల్ఆర్‌లో మార్పులు చేసింది. 2025 ఫిబ్రవరి నుండి రెపోరేటు మొత్తం తగ్గింపు 50 బేసిస్ పాయింట్లకు చేరుకుంది. రెపో రేటు అనేది వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణంపై వసూలు చేసే వడ్డీ రేటు. ఇది తగ్గితే సాధారణంగా బ్యాంకింగ్ రంగంలో రుణ వ్యయాలు తగ్గుతాయి. ఫలితంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి బ్యాంకులు తక్కువ రుణ రేట్ల ద్వారా తక్కువ ఫండింగ్ ఖర్చుల ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయి.
రుణగ్రహీతలకు ఏంటి ప్రయోజనం?
ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణం కోసం ఒక ఆర్థిక సంస్థ వసూలు చేయాల్సిన కనీస వడ్డీ రేటు. ఇది రుణానికి వడ్డీ రేటు తక్కువ పరిమితిని నిర్ణయిస్తుంది. ప్రత్యేకంగా ఆర్బీఐ సవరిస్తే తప్ప ఇదే రేటును బ్యాంకులు అమలు చేస్తాయి. 2016లో ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఎంసీఎల్ఆర్‌ను గృహ, వ్యక్తిగత, వాహన రుణాలతో సహా వివిధ ఫ్లోటింగ్ రేట్ రుణాలకు ఉపయోగిస్తారు. ఎంసీఎల్ఆర్ తగ్గడం వల్ల రుణం ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై ఆధారపడిన రుణ ఈఎంఐలు తగ్గుతాయి లేదా రుణ కాలపరిమితి తగ్గుతుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు
ఓవర్‌నైట్: 9.00%
1 నెల: 9.00%
3 నెలలు: 9.05%
6 నెలలు: 9.15%
1 సంవత్సరం: 9.15%
2 సంవత్సరాలు: 9.20%
3 సంవత్సరాలు: 9.20%