భారీగా తగ్గిన ఎక్స్(ట్విటర్) విలువ.. మస్క్ నిర్ణయాలే కారణమా?

Elon Musk's X Worth Falls To $19 Billion: Check Details - Sakshi

ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Mask) ఎక్స్ (ట్విటర్) సంస్థను 2022లో 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసాడు. కంపెనీ మస్క్ సొంతం చేసుకున్నప్పటి నుంచి ఎంతోమంది ఉద్యోగులను తొలగించారు, లోగో మార్చారు, ఆఖరికి పేరు కూడా మార్చేశాడు. ఇప్పుడు కంపెనీ విలువ భారీగా తగ్గిపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విటర్) విలువ ప్రస్తుతం 19 బిలియన్ డాలర్లకు చేరి ఆర్థికంగా కష్టాల్లో పడింది. స్టాక్ ధరలు పడిపోవడం, ప్రకటనల ఆదాయం తగ్గిపోవడంతో సంస్థ విలువ తగ్గిపోయినట్లు మస్క్ అంగీకరించినట్లు సమాచారం.

ట్విట్టర్ సంస్థను మస్క్ కొనుగోలు చేసిన సంవత్సరం తరువాత దాని విలువ సుమారు 55 శాతం తగ్గిపోయింది. కంపెనీ కష్టాల్లో ఉన్న సమయంలో కూడా సంస్థ భవిష్యత్తు గురించి తాను ఆశాజనకంగా ఉన్నానని మస్క్ వెల్లడించాడు. డేటింగ్ సర్వీస్, జాబ్ రిక్రూట్‌మెంట్ వంటి వాటితో 'ఎక్స్'ను వర్సిటైల్ యాప్‌గా మార్చాలనుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్!

మస్క్ యాజమాన్యం కింద కంపెనీ ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల ప్రకటనదారులు కూడా దూరమైనట్లు చెబుతున్నారు. దీంతో కంపెనీపై 13 బిలియన్ డాలర్ల ఋణభారం పడింది, దీనికి సంవత్సరానికి 1.2 బిలియన్ డాలర్ల వడ్డీ చెల్లింపులు జరుగుతున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: జనవరి 1 నుంచి బీమాలో కొత్త రూల్స్ - తెలుసుకోవాల్సిందే!

'ఎక్స్'లో పోస్ట్ చేయడానికి డబ్బు చెల్లించాలని, ఎక్స్ సబ్‌స్క్రిప్షన్‌లు ప్లాన్ వంటివి ప్రవేశపెడుతున్నారు. ఇవన్నీ కూడా కంపెనీకి మరిన్ని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి నిర్ణయాలు సాధారణ వినియోగదారులను దూరం చేస్తాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top