
వచ్చే ఐదేళ్లలో ఏటా 6.5 శాతం వృద్ధి
రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా
విద్యుత్ డిమాండ్ ఏటా 6 శాతం నుంచి 6.5 శాతం చొప్పున (కాంపౌండెడ్‌గా) వచ్చే ఐదేళ్ల పాటు పెరుగుతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విస్తరణతోపాటు గ్రీన్ హైడ్రోజన్‌కు ఇస్తున్న ప్రాధాన్యం, డేటా సెంటర్ల విస్తరణ విద్యుత్ అవసరాలను అధికం చేస్తుందని పేర్కొంది.
2025–26 ఆర్థిక సంవత్సరంలో విద్యుదుత్పత్తి సామర్థ్యం ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో 44 గిగావాట్లుగా ఉంటుందని అంచనా వేసింది. 2024-25లో ఆల్‌టైమ్ గరిష్ట ఉత్పత్తి 34 గిగావాట్లుగా ఉంది. వచ్చే ఐదేళ్లలో అదనంగా ఏర్పడే డిమాండ్‌లో ఈ మూడు రంగాల నుంచే 20-25 శాతం వాటా ఉంటుందని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెండ్ విక్రమ్ తెలిపారు.
రూఫ్‌టాప్ సోలార్ వినియోగం పెరుగుతుండడం, ఆఫ్ గ్రిడ్ ప్రాజెక్టుల నేపథ్యంలో గ్రిడ్ సామర్థ్య డిమాండ్ కొంత వరకు తగ్గొచ్చన్నారు. రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టలేషన్లను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రస్తావించారు. 2026 మార్చి నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 520 గిగావాట్లకు చేరుకుంటుందని ఇక్రా రేటింగ్స్ తన నివేదికలో పేర్కొంది.
2025–2026లో థర్మల్ విభాగం నుంచి 9-10 గిగావాట్ల కొత్త సామర్థ్యం అందుబాటులోకి రానుండగా.. మిగిలినదంతా పునరుత్పాదక విద్యుత్ వనరుల రూపంలో ఉంటుందని తెలిపింది. రానున్న సంవత్సరాల్లో కొత్త సామర్థ్యంలో పునరుత్పాదక విద్యుత్ (ఆర్‌ఈ) కీలక పాత్ర పోషించనుందని పేర్కొంది. థర్మల్ విద్యుత్ విభాగం పట్ల స్థిరమైన అవుట్‌లుక్‌తో ఉన్నట్టు ఇక్రా తెలిపింది.