హమారా.. స్కూటర్‌! | Electric scooters sales grow | Sakshi
Sakshi News home page

హమారా.. స్కూటర్‌!

May 28 2025 1:19 AM | Updated on May 28 2025 5:55 AM

Electric scooters sales grow

పటిష్టమైన అర్బన్‌ డిమాండ్‌.. ఈవీల దన్ను 

బైక్‌ అమ్మకాలకు మించిన వృద్ధి 

మళ్లీ కోవిడ్‌ ముందస్తు స్థాయికి సేల్స్‌ 

టూవీలర్లలో క్రమంగా ఎగబాకుతున్న స్కూటర్ల వాటా

మన రోడ్లపై స్కూటర్లు టాప్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ తగ్గుముఖంతో మందగమనాన్ని ఎదుర్కొంటున్న టూవీలర్ల మార్కెట్‌కు ఇప్పుడు స్కూటర్లే దన్నుగా నిలుస్తున్నాయి. బైక్‌ అమ్మకాలతో పోలిస్తే గతేడాఇ స్కూటర్ల విక్రయాల్లో భారీగా వృద్ధి నమోదవడం దీనికి నిదర్శనం. ఈ ఏడాది కూడా ఇదే జోరు కొనసాగుతుందని పరిశ్రమ నిఫుణులు పేర్కొంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఫుల్‌ డిమాండ్‌తో పాటు నెమ్మదిగా ద్విచక్ర వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలకు (ఈవీ)కు మారుతుండటం కూడా స్కూటర్‌ దూకుడుకు దోహదం చేస్తోంది! – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

స్కూటర్ల అమ్మకాలు 2024–25 ఆర్థిక సంవత్సరంలో ‘టాప్‌’లేపాయి. 
ఏకంగా 68.5 లక్షల విక్రయాలతో కోవిడ్‌ ముందు (2018–19)లో నమోదైన 67 లక్షల రికార్డును బ్రేక్‌ చేశాయి. అప్పుడు కూడా స్కూటర్ల జోరు కారణంగానే మొత్తం టూవీలర్‌ విభాగం దేశీ అమ్మకాలు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిని (2.12 కోట్ల వాహనాలు) తాకడం గమనార్హం. కాగా, ఆటోమొబైల్‌ డీలర్ల అసోసియేషన్‌ గణాంకాల ప్రకారం గతేడాది స్కూటర్ల విక్రయాలు 17.36 శాతం ఎగబాకాయి. మొత్తం టూవీర్ల అమ్మకాలు 9% పెరగ్గా... బైక్‌ల సేల్స్‌ 5 శాతం మాత్రమే పుంజుకున్నాయి. 

పట్టణాల్లో ఫుల్‌ డిమాండ్‌... 
గత కొన్నేళ్లుగా పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోవడం ఇతరత్రా సమస్యలకు తోడు.. కుటుంబంలో అందరూ నడపడానికి అనువుగా ఉండటం వంటి సానుకూలతల కారణంగా స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ‘గేర్‌లెస్‌ కావడంతో పాటు నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో నడపడం ఈజీగా ఉండటం వల్ల నిత్యం ఆఫీసులకు వెళ్లొచ్చేవారు, ముఖ్యంగా మహిళలు, నవతరం వాహనదారులు స్కూటర్లకే జై కొడుతున్నారు. పటిష్టమైన అర్బన్‌ డిమాండ్‌కు తోడు ఈవీలకు మారుతున్న వారు పెరుగుతుండటం వల్ల కూడా బైక్‌లతో పోలిస్తే స్కూటర్ల విక్రయాల్లో భారీ వృద్ధి నమోదవుతోంది’ అని క్రిసిల్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ పూనమ్‌ ఉపాధ్యాయ్‌ అభిప్రాయపడ్డారు. 

వాటా పైపైకి... 
టూవీలర్‌ విభాగంలో ఇప్పటికీ బైక్‌లదే పైచేయి. మొత్తం అమ్మకాల్లో 60 శాతం పైగా మెజారిటీ వాటాను కొల్లగొడుతున్నాయి. అయితే, గత నాలుగైదేళ్లుగా  స్కూటర్‌ మార్కెట్‌ వాటా క్రమంగా పుంజుకుంటోంది. వాహన తయారీదారుల సంఘం (సియామ్‌) గణాంకాల ప్రకారం 2019–20లో టూవీలర్‌ అమ్మకాల్లో 66 శాతంగా ఉన్న మోటార్‌సైకిళ్ల వాటా.. 2024–25 నాటికి 62%కి దిగొచి్చంది. మరోపక్క, స్కూటర్ల వాటా 30 శాతం నుంచి 35 శాతానికి జంప్‌ చేసింది. దీని ప్రకారం చూస్తే... çట్రెండ్‌ మారుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

‘ఎలక్ట్రిక్‌’ వేగం...
ఇటీవలి కాలంలో ఈవీల జోరు పెరగడం.. ఎక్కువ మంది ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ఎంచుకోవడంతో టూవీలర్‌ విభాగం పుంజుకోవడానికి దోహదపడుతోందని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. 2025–26లో అమ్ముడైన మొత్తం టూవీలర్లలో ఈవీల వాటా 6 శాతానికి పైగా నమోదైంది. ‘రాబోయే కాలంలో ఈవీల ధరలు దిగొచ్చే అవకాశం ఉండటం, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి అంశాలతో స్కూటర్‌ పరిశ్రమలో ఈవీల వాటా మరింత పెరగడం ఖాయం. ఇప్పటికే ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది’ అని టీవీఎస్‌ మోటార్స్‌ సీఈఓ కేఎన్‌ రాధాకృష్ణన్‌ తాజాగా పేర్కొన్నారు. 2024–25లో తొలిసారి ఈ–టూవీలర్లు 10 లక్షల అమ్మకాల మైలురాయిని దాటాయి. మొత్తం 11.4 లక్షలకు పైగా సేల్స్‌తో ఈ–టూవీలర్‌ విభాగంలో ఏకంగా 21 శాతం వృద్ధి నమోదైంది.

టీవీఎస్‌ మోటార్స్, బజాజ్‌ ఆటో, హీరో మోటో వంటి టూవీలర్‌ దిగ్గజాలతో పాటు నవతరం ఎలక్ట్రిక్‌ వాహన సంస్థలైన ఓలా ఎలక్ట్రిక్, ఏథర్‌ ఎనర్జీ వంటివి కొంగొత్త మోడళ్లతో ఈవీ మార్కెట్లో వాటా కోసం పోటీపడుతున్నాయి. స్కూటర్లలో విభిన్న వర్గాల అవసరాలకు, విభిన్న మోడళ్లు అందుబాటులో ఉండడం కూడా ఎకానమీ బైక్‌లకు మించి స్కూటర్‌ అమ్మకాలు పుంజుకోవడానికి మరో ముఖ్య కారణమని రాధాకృష్ణన్‌ చెప్పారు. 2021–22లో టీవీఎస్‌ టూవీలర్‌ సేల్స్‌లో స్కూటర్ల వాటా 25 శాతం ఉండగా.. 2024–25లో ఇది 40 శాతానికి దూసుకెళ్లింది. గతేడాది కంపెనీ మొత్తం 47.4 లక్షల ద్విచక్రవాహనాలను విక్రయించింది. ఇదిలాఉంటే, టీవీఎస్‌ స్కూటర్‌ విక్రయాల్లో 15 శాతం ఎలక్ట్రిక్‌ ఐక్యూబ్‌దే కావడం మరో విశేషం! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement