అనిశ్చిత పరిస్థితుల్లో స్థిరమైన రాబడులు..

Details About HDFC Corporate Bond Fund - Sakshi

ఆర్‌బీఐ ఇటీవలి సమీక్షలోనూ కీలకమైన రెపో రేటును 4 శాతం వద్దే ఉంచుతూ, సర్దుబాటు విధానాన్నే కొనసాగిస్తూ నిర్ణయించింది. కాకపోతే ద్రవ్యోల్బణం పెరుగుతున్న దృష్ట్యా ఒక్క విడత అయినా రేటును పెంచొచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. సమీప భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న దృష్ట్యా.. మూడేళ్ల వరకు స్వల్పకాలానికి ఇన్వెస్ట్‌ చేసుకోవాలనుకునే వారికి కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌ అనుకూలమని చెప్పొచ్చు. ఈ విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌ పనితీరు ఆకర్షణీయంగా, స్థిరంగా కనిపిస్తున్నందున ఇన్వెస్టర్లు దీనిపై ఓసారి దృష్టి సారించొచ్చు.  
ఎందుకని..? 
డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను మూడేళ్లు నిండిన తర్వాత వెనక్కి తీసుకుంటే.. వచ్చిన లాభాలపై 20 శాతం మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తీసివేసి.. మిగిలిన మొత్తంపైనే పన్ను చెల్లిస్తే చాలు. ఈ రకంగా పన్ను చెల్లించిన తర్వాత రాబడులను పరిశీలించినట్టయితే.. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయి. కాకపోతే ఇందులో రిస్క్‌ ఉంటుంది. రాబడులు మార్కెట్‌ ఆధారితమని గుర్తుంచుకోవాలి. 
క్రెడిట్‌ రిస్క్‌.. 
కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌ అన్నవి కనీసం 80 శాతం పెట్టుబడులను అధిక క్రెడిట్‌ రేటింగ్‌ కలిగిన నాణ్యమైన కార్పొరేట్‌ బాండ్లలోనే ఇన్వెస్ట్‌ చేస్తాయి. కనుక పోర్ట్‌ఫోలియో క్రెడిట్‌ నాణ్యత పెద్దగా మారేదేమీ ఉండదు. అంటే ఈ మేరకు కొంత రక్షణ ఏర్పాటు చేసుకున్నట్టే అవుతుంది. వడ్డీ రేట్ల రిస్క్‌ను ఇన్వెస్టర్లు గుర్తులో పెట్టుకోవాలి. వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో దీర్ఘకాలంతో కూడిన బాండ్లను కలిగి ఉంటే రాబడులపై ప్రభావం పడుతుంది.  
విధానం.. పనితీరు 
హెచ్‌డీఎఫ్‌సీ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌ అక్రూయల్, డ్యురేషన్‌ విధానాలను అనుసరిస్తుంది. వడ్డీ రేట్లు పడిపోతున్నాయని.. పెరుగుతున్నాయని గుర్తించినప్పుడు పోర్ట్‌ఫోలియోలోని పెట్టుబడుల కాలవ్యవధుల్లో మార్పులు చేస్తుంది. దీన్నే డ్యురేషన్‌ స్ట్రాటజీగా పేర్కొంటారు. అచ్చంగా అక్రూయల్‌ స్ట్రాటజీతో పోలిస్తే డ్యురేషన్‌ స్ట్రాటజీ అధిక రాబడులను ఇస్తుంది. ఈ పథకం ఏడాది నుంచి ఐదేళ్ల వరకు కాలవ్యవధిని పెట్టుబడి సాధనాలకు అమలు చేస్తుంటుంది. 2016 నుంచి చూస్తే కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌ విభాగం ఏడాది, మూడేళ్ల సగటు రోలింగ్‌ రాబడులు 7.7 శాతంగానే ఉన్నాయి. కానీ, హెచ్‌డీఎఫ్‌సీ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌ రాబడులు ఏడాది కాలంలో సగటున 8.4 శాతం, మూడేళ్ల రాబడులు 8.6 శాతం చొప్పున ఉన్నాయి. పదేళ్ల కాలంలో సగటు వార్షిక రాబడి 8.74 శాతంగా ఉండడం గమనార్హం. అయితే డెట్‌ ఫండ్స్‌రాబడులు ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండవని గుర్తుంచుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో నష్టాలను కూడా ఈ పథకం పరిమితం చేస్తుండడం ఆకర్షణీయం.  
పోర్ట్‌ఫోలియో 
ఈ పథకం పెట్టుబడులను గమనిస్తే నాణ్యతకు పెద్దపీట వేసినట్టు తెలుస్తుంది. పోర్ట్‌ఫోలియోలో 96 శాతం సాధనాలు ఏఏఏ రేటెంగ్‌ కలిగిన కార్పొరేట్, ప్రభుత్వ డెట్‌ పేపర్లే ఉన్నాయి. రేటింగ్‌ పరంగా ఏఏఏ అత్యంత మెరుగైనది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పథకం పోర్ట్‌ఫోలియోను గమనించినా అత్యంత నాణ్యమైన పేపర్లు 90 శాతానికి పైనే ఉంటూ వస్తున్నాయి. పెట్టుబడుల సగటు మెచ్యూరిటీ 2.74 సంవత్సరాలుగా ఉంది. రేట్లు తిరిగి పెరగడం మొదలైతే ఆ ప్రయోజనాలను సొంతం చేసుకునే అనుకూతలతలు ఈ పథకానికి ఉన్నాయి.  


 

చదవండి: Fund Review: స్థిరత్వంతో కూడిన రాబడులు.. మిరే అస్సెట్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top